అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Mohammad Shami | టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీని జట్టులో ఎంపిక చేయకపోవడంపై అనేక పుకార్లు వచ్చిన విషయం తెలిసిందే. ఈ పుకార్లపై ఎట్టకేలకు స్పందించాడు.
షమీని ఆస్ట్రేలియా పర్యటనకు (Australia Tour) ఎంపిక చేయకపోవడంతో సోషల్ మీడియాలో మీమ్స్, చర్చలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో తన యూట్యూబ్ ఛానల్ ద్వారా క్లారిటీ ఇచ్చాడు. “జట్టులోకి ఎంపిక చేయాలా, వద్దా అనే నిర్ణయం నా చేతుల్లో ఉండదు. అది పూర్తిగా సెలక్షన్ కమిటీ, కోచ్, కెప్టెన్ నిర్ణయం. నా అవసరం ఉందనుకుంటే పిలుస్తారు. నేను మాత్రం నా ప్రాక్టీస్‌ను కొనసాగిస్తూ, ఆటకు సిద్ధంగా ఉన్నాను,” అని షమీ స్పష్టం చేశాడు.
Mohammad Shami | ఫిట్‌నెస్ గురించి క్లారిటీ
తన ఆరోగ్య పరిస్థితిపై వస్తున్న ఊహాగానాలపై కూడా షమీ స్పందించాడు. “నా ఫిట్‌నెస్ చాలా బాగుంది. దులీప్ ట్రోఫీలో 35 ఓవర్లు బౌలింగ్ చేశాను. బాడీలో ఎలాంటి ఇబ్బంది లేదు. రిథమ్ కూడా బాగుంది,” అని చెప్పారు. ఆటకు దూరంగా ఉన్న సమయంలో కూడా ప్రేరణ కోల్పోకూడదని సూచించారు. వన్డే కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ (Shubhman Gill) నియామకంపై స్పందించిన షమీ, ఇది పూర్తిగా బీసీసీఐ, సెలక్టర్లు, కోచ్ నిర్ణయం అని పేర్కొన్నాడు. గిల్‌కు మంచి అనుభవం ఉంది. గుజరాత్ టైటన్స్‌కి కెప్టెన్‌గా ఉన్నాడు, ఇంగ్లండ్ టూర్‌లోనూ జట్టును అద్భుతంగా నడిపాడు. కెప్టెన్సీ ఎప్పటికీ మారుతూ ఉంటుంది. ఈరోజు ఒకరు ఉంటారు, రేపు ఇంకొకరు.. అది సహజం,” అని వివరించాడు.
తనపై వస్తున్న అవాస్తవ ప్రచారాలను నమ్మొద్దని, జట్టు ఎంపికలు వివేకంతో జరిగే ప్రక్రియ అని షమీ తేల్చిచెప్పాడు. సమయం వచ్చినప్పుడు తాను జట్టులోకి వస్తానని, ప్రతిభ, ఫిట్‌నెస్ ఆధారంగానే ఎంపికలు జరిగే విధానాన్ని గౌరవించాలని అభిమానులకు సూచించాడు. ఇప్పటివరకు షమీ భారత్ తరఫున 64 టెస్టులు, 95 వన్డేలు, 23 టీ20లు ఆడి మెరుగైన ప్రదర్శనలు ఇచ్చాడు. మళ్లీ జట్టులోకి ఎప్పుడొస్తాడన్నది ఆసక్తికర అంశంగా మారింది. ఒకప్పుడు షమీ మెరుపు బంతులతో ప్రత్యర్థులను గడగడలాడించాడు. మరి అతనికి రీఎంట్రీ ఛాన్స్ ఎప్పుడు వస్తుంది, ఎలా రాణిస్తాడు అనేది చూడాల్సి ఉంది.