Asia Cup | ఆసియా కప్‌లో భారత్-పాకిస్తాన్(India vs Pakistan) మ్యాచ్ తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. భారత్ ఆటగాళ్లు, పాకిస్థాన్ ఆటగాళ్లు షేక్ హ్యాండ్(Shake Hand) ఇచ్చుకోవడం తీవ్ర వివాదానికి దారితీసింది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ మాజీ క్రికెటర్ మహ్మద్ యూసఫ్ చేసిన అసభ్య వ్యాఖ్యలు తీవ్ర ఆగ్రహానికి కారణమయ్యాయి.
పాకిస్థాన్ టీవీ ఛానల్ సమా టీవీలో క్రికెట్ డిబేట్‌లో పాల్గొన్న మహ్మద్ యూసఫ్, భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav)ను ఉద్దేశిస్తూ “పంది” అని సంబోధించి తీవ్ర విమర్శలపాలయ్యాడు.అంతేకాకుండా, “భారత్ క్రికెట్ అంపైర్లను, మ్యాచ్ రెఫరీలను వాడుకొని పాకిస్థాన్‌ను వేధిస్తోందంటూ” ఆరోపణలు చేశాడు.
Asia Cup | పిచ్చి మాటలు..
భారత జట్టు తమ సినీ ప్రపంచం నుంచి బయటకు రాలేకపోతున్నట్టుగా కనిపిస్తుంది. ఆట కాదు, నటనతో గెలవాలని చూస్తోంది’’ అంటూ వ్యాఖ్యానించాడు. ఉద్దేశపూర్వకంగా సూర్యకుమార్ యాదవ్ పేరును సువర్ కుమార్ యాదవ్ అంటూ తప్పుగా పలికి వివాదాన్ని మరింత రాజేశాడు. దీని పట్ల భారత అభిమానులు, ఇండియన్ క్రికెటర్స్ మహ్మద్ యూసఫ్(Muhammad Yousuf)పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. వెంటనే సూర్య కుమార్ యాదవ్ కి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక తాజాగా జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ ఘోర పరాజయం చవిచూసింది. దానికి తోడు హ్యాండ్‌షేక్ ఇవ్వకపోవడం పీసీబీకి ఆగ్రహానికి దారి తీసింది. మ్యాచ్ రెఫరీ ఆండీ పైక్రాఫ్ట్(Referee Andy Pycroft) చేతులు కలపకూడదని చెప్పాడంటూ పాకిస్తాన్ ఆరోపించింది. దీనిపై పీసీబీ ఐసీసీకి ఫిర్యాదు చేసింది. పైక్రాఫ్ట్‌ను తమ తదుపరి మ్యాచ్ నుంచి తొలగించాలని కోరింది.
అయితే, ఐసీసీ (ICC)ఈ డిమాండ్‌ను తిప్పికొట్టింది. పైక్రాఫ్ట్ అలాంటి ఆదేశాలు ఇవ్వలేదని స్పష్టం చేసింది. అదే విషయాన్ని భారత జట్టు కూడా ధృవీకరించింది. హ్యాండ్‌షేక్ లేకపోవడం ప్లేయర్ల వ్యక్తిగత నిర్ణయమని తెలిపింది. పీసీబీ ఒక దశలో ఆసియా కప్(Asia Cup)ను బహిష్కరిస్తామంటూ హెచ్చరిక జారీ చేసింది. అయితే, ఈ నిర్ణయం పాకిస్థాన్‌కు ఆర్థికంగా భారీ నష్టాన్ని కలిగిస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఆసియా కప్ ఒక వైపు క్రికెట్ పండుగగా మారితే మరోవైపు భారత్-పాక్ మధ్య రాజకీయ వైరంగా కూడా మారుతుంది. బలమైన భావోద్వేగాలు టోర్నీపై ప్రభావం చూపుతున్నాయి. క్రికెట్‌ను క్రీడా స్పూర్తితో చూడాల్సిన సమయం ఇది. కానీ, మాజీ క్రికెటర్స్ ఈ స్థాయిలో అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసి పరిస్థితిని మరింత దిగజార్చుతున్నారు.