అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Putin on Modi | భారత్‌పై అమెరికా సుంకాల నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. మోదీ గురించి తనకు తెలుసని, ఆయన ట్రంప్ ఒత్తిడికి తలొగ్గే వ్యక్తి కాదని పేర్కొన్నారు.
రష్యా నుంచి చమురు, ఆయుధాలు కొనుగోలు చేస్తున్నామనే కారణంతో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ (Donald Trump) భారత్‌పై సుంకాలు విధించిన విషయం తెలిసిందే. ఫార్మా ఉత్పత్తులు, భారతీయ సినిమాల వంద శాతం టారిఫ్‌లు ప్రకటించారు. అలాగే మిగతా వస్తువులపై 50 శాతం సుంకాలు అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా పుతిన్ (Putin) కీలక వ్యాఖ్యలు చేశారు. డిసెంబర్‌లో ఆయన భారత్‌లో పర్యటించనున్నారు. అమెరికా విధించిన భారీ సుంకాలతో కలిగే నష్టాలను భారత్ సమతుల్యం చేయగలదని పుతిన్ పేర్కొన్నారు.
Putin on Modi | మా సంబంధం ప్రత్యేకమైంది
అంతర్జాతీయ వాల్డాయ్ చర్చా వేదికలో పుతిన్ మాట్లాడారు. రష్యా– భారతదేశం (Russia–India) మధ్య ఎప్పుడూ సమస్యలు, ఉద్రిక్తతలు లేవని ఆయన చెప్పారు. భారతదేశం-రష్యా సంబంధాన్ని ప్రత్యేకమైనదిగా ఆయన అభివర్ణించారు. ప్రధాని మోదీని (PM Modi) తన స్నేహితుడు అని పుతిన్ అన్నారు. రష్యా నుంచి చమురు దిగుమతులను నిలిపివేయాలని అమెరికా ఒత్తిడిని పట్టించుకోకుండా భారతదేశం తీసుకున్న నిర్ణయాన్ని ఆయన ప్రశంసించారు.
Putin on Modi | నష్టాలను భర్తీ చేస్తాం
అమెరికా విధించిన సుంకాలతో భారతదేశం ఎదుర్కొంటున్న నష్టాలను రష్యా నుంచి ముడి చమురు దిగుమతుల ద్వారా సమతుల్యం చేస్తారని పుతిన్ అన్నారు. వాణిజ్య అసమతుల్యతను తొలగించడానికి, రష్యా భారతదేశం నుండి మరిన్ని వ్యవసాయ ఉత్పత్తులు, ఔషధాలను దిగుమతి చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. ‘బ్రిక్స్’ను ఏర్పాటు చేసిన ఇండియా, చైనాలకు పుతిన్ థాంక్స్ చెప్పారు. ప్రాచీన భారతీయ నాగరికత అంటే తమకు చాలా గౌరవం అని ఆయన తెలిపారు. ప్రధాని మోదీ తన దేశం గురించి మొదట ఆలోచించే తెలివైన వ్యక్తి అని పుతిన్ అన్నారు.