అక్షరటుడే, వెబ్‌డెస్క్ : PM Modi | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం సాయంత్రం 5 గంటలకు జాతినుద్దేశించి ప్రసగించనున్నారు. ఈ రోజు రాత్రి 12 గంటల నుంచి జీఎస్టీ సంస్కరణలు (GST Reforms) అమలులోకి రానున్నాయి. దాని గురించి ఆయన మాట్లాడే అవకాశం ఉంది.
ప్రధాని మోదీ చివరిసారిగా మే 12న జాతినుద్దేశించి మాట్లాడారు. ఆ సమయంలో ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) గురించి ఆయన ప్రసగించారు. ప్రస్తుతం జీఎస్టీ 2.0, అమెరికా టారిఫ్‌లు, హెచ్1బీ వీసాల దరఖాస్తు ఫీజు పెంపు తదితర అంశాలపై ఆయన మాట్లాడే అవకాశం ఉంది. ఆయన ఏం మాట్లాడుతారని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
PM Modi | అమలులోకి జీఎస్టీ 2.0..
దేశవ్యాప్తంగా దుర్గా నవరాత్రి ఉత్సవాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఆదివారం అర్ధరాత్రి నుంచి జీఎస్టీ 2.0 అమలులోకి రానుంది. జీఎస్టీ సంస్కరణలతో దసరాకు ప్రజలు డబుల్ దమాకా వచ్చినట్లు కానుంది. దీంతో అనేక వస్తువుల రేట్లు దిగి రానున్నాయి. గతంలో జీఎస్టీలో 5, 12, 18, 28శాతం పన్ను శ్లాబులు ఉండగా.. రేపటి నుంచి 5శాతం, 18 శాతం శ్లాబులు మాత్రమే ఉండనున్నాయి.
ఆర్థిక వ్యవస్థలో వస్తువుల ధరలను తగ్గించడం, ప్రస్తుత పండుగ సీజన్‌కు వినియోగదారుల డిమాండ్‌ను పెంచడం, మధ్య తరగతికి వస్తువులను అందుబాటులోకి తీసుకురావడం లక్ష్యంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తాజాగా మోదీ తన ప్రసంగంలో వీటి గురించే మాట్లాడే అవకాశం ఉంది. జీఎస్టీ సంస్కరణలో 12 శాతం స్లాబ్ కింద దాదాపు 99 శాతం వస్తువులు 5 శాతం పన్ను పరిధిలోకి మారుతాయి. 28 శాతం పన్ను కేటగిరీలోని 90 శాతం వస్తువులు 18 శాతంలోకి రానున్నాయి.
PM Modi | ట్రంప్‌కు కౌంటర్ ఇస్తారా..
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఇటీవల భారత్‌కు నష్టం కలిగించేలా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే 50 సుంకాలు విధించిన ఆయన తాజాగా హెచ్1బీ వీసా (H1B Visa)ల దరఖాస్తు ఫీజును సైతం భారీగా పెంచారు. దీనిపై శనివారం మోదీ స్పందిస్తూ మనకు అసలైన శత్రువు ఇతర దేశాలపై ఆధారపడటమేనని అన్నారు. అయితే ట్రంప్ చర్యలు, అమెరికాతో వాణిజ్యంపై నేడు మోదీ ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రధాని సోమవారం అరుణాచల్ ప్రదేశ్, త్రిపురలో పర్యటించనున్నారు.