HomeUncategorizedPm modi birthday | ప్రధాని మోదీ 75వ పుట్టినరోజు.. రిటైర్మెంట్ రూల్​పై జోరుగా సాగుతున్న‌...

Pm modi birthday | ప్రధాని మోదీ 75వ పుట్టినరోజు.. రిటైర్మెంట్ రూల్​పై జోరుగా సాగుతున్న‌ చర్చ

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Pm modi birthday | దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ఈ రోజు (సెప్టెంబర్ 17, 2025) తన 75వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా దేశ వ్యాప్తంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ప్రముఖులు, బీజేపీ నేతలు, ఇతర రాజకీయ పార్టీలు, సినీ, సాంస్కృతిక రంగ ప్రముఖులు కూడా సోషల్ మీడియా వేదికగా మోదీకి అభినందనలు తెలిపారు. అయితే ఈ పుట్టినరోజుతో దేశ రాజకీయ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన చర్చ కూడా మొదలైంది. అదేంటంటే ఇదే మోదీకి ప్రధాని హోదాలో చివరి పుట్టినరోజా? అంటూ చర్చ సాగుతోంది. ఈ చర్చకు కారణం ఆర్‌ఎస్‌ఎస్ (RSS) మరియు బీజేపీ వర్గాల్లో అమలవుతున్న ’75 ఏళ్ల వయసు తర్వాత క్రియాశీల రాజకీయాల నుంచి విరమణ’ అనే విధానం.

Pm modi birthday | మోదీకి ఈ నియమం వర్తిస్తుందా?

గతంలో ఈ నియమం ఆధారంగా ఎల్.కే.అద్వానీ (Lk Advani), మురళీ మనోహర్ జోషి లాంటి సీనియర్ నేతలను మార్గదర్శక్ మండలి అనే కన్సల్టేటివ్ బాడీలోకి పంపించారు. ప్రధానిగా మోదీ ఇప్పటికే 11 సంవత్సరాల నుండి కొనసాగుతున్నారు. ఇప్పుడు ఆయన 75వ వయస్సులోకి ప్రవేశించడంతో, ఈ నియమం మోదీకి వర్తిస్తుందా లేదా అన్నదానిపై చర్చ జరుగుతోంది. ఆయన్ని కూడా రాజకీయంగా పక్కకు త‌ప్పిస్తారా? అనే సందేహాలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసాయి. అయితే ఈ అంశంపై ఇప్పటికే స్పష్టత ఇచ్చిన సంఘటనలు ఉన్నాయి. RSS చీఫ్​ మోహన్ భగవత్ గతంలో మాట్లాడుతూ.. “75 ఏళ్ల తరువాత పదవి వీడాల్సిందే అనే నియమం మా సంస్థలో లేదు. ఎవరికైతే ఎలాంటి పని అప్పగిస్తామో, వారు ఎప్పుడు చేయాలో మేమే నిర్ణయిస్తాం. ఇది వయస్సుతో సంబంధం లేని విషయం” అని వ్యాఖ్యానించారు.

అలాగే బీజేపీ వర్గాలు కూడా ఈ రూల్‌ను పట్టించుకోవడం లేదని స్పష్టం చేశాయి. హోం మంత్రి అమిత్ షా (Amith Shah) ఒక సందర్భంలో మాట్లాడుతూ, “మోదీ 2029 వరకు ప్రధానిగా కొనసాగుతారు” అని ధీమాగా చెప్పారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌లో 80 సంవత్సరాలకు పైబడిన కొంతమంది మంత్రులు ఉన్నారని గుర్తుచేస్తూ, వయస్సు పరిమితికి పెద్దగా ప్రాధాన్యత లేదని పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రధాని మోదీకి ఇది చివరి పుట్టినరోజా లేదా అన్నది తేలడానికి కొంత సమయం పడుతుంది. కానీ, ఇప్పట్లో ఆయన రాజీనామా చేయబోతున్నారన్న సూచనలు మాత్రం క‌నిపించ‌డం లేదు. పైగా పార్టీ, సంఘ్​ ఆయన నేతృత్వంపై నమ్మకంతో ఉంది. దీంతో 2029 వరకు మోదీ పదవిలో కొనసాగే అవకాశాలు ఎక్కువగానే ఉన్నట్లు కనిపిస్తోంది.

Must Read
Related News