అక్షరటుడే, వెబ్‌డెస్క్ : PM Modi | ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి కాంగ్రెస్, ఆర్జేడీలపై నిప్పులు చెరిగారు. బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో గురువారం నిర్వహించిన బహిరంగ సభలో మోదీ రాష్ట్రీయ జనతాదళ్‌పై (Rashtriya Janata Dal) తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
ఆ పార్టీ బీహార్‌ను “జంగిల్ రాజ్” యుగంలోకి తీసుకెళ్తోందని ఆరోపించారు. ఆర్జేడీ పాలన “కట్ట (తుపాకి), క్రుర్త (క్రూరత్వం), కటుట (చేదు), కుషాసన్ (దుర్పరిపాలన) అవినీతి”తో నిండి ఉండేదని ప్రధాని గుర్తు చేశారు. ఇటువంటి రాజకీయాలను తిరస్కరించి, రాబోయే ఎన్నికల్లో అభివృద్ధి, స్థిరత్వానికి మద్దతు ఇవ్వాలని ఆయన ప్రజలను కోరారు.
PM Modi | ఇదేం పద్ధతి..
సంప్రదాయ, వారసత్వ పండుగలను, ప్రజల సెంటిమెంట్‌ను ఆర్జేడీ, కాంగ్రెస్ (Congress) అవమానిస్తున్నాయని ప్రధాని మండిపడ్డారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఛత్ మైయ్యను అగౌరవపరిచారని కాంగ్రెస్, ఆర్జేడీపై మరింత దాడి చేశారు. ఛత్ మైయ్య గురించి ప్రతిపక్షాలు చేసిన వ్యాఖ్యలను ప్రధాని మోదీ ప్రశ్నిస్తూ, “ఎన్నికల్లో ఓట్ల కోసం ఛత్ మైయ్యను ఎవరైనా అవమానించగలరా? బీహార్‌తో పాటు దేశ ప్రజలు అలాంటి అవమానాన్ని సహిస్తారా?” అని ప్రశ్నించారు.
ఛత్ ఉత్సవం సాంస్కృతిక ప్రాముఖ్యతను హైలైట్ చేస్తూ “ఛఠ్ మహాపర్వ్ ను యునెస్కో అవ్యక్త సాంస్కృతిక వారసత్వ జాబితాలో చేర్చడానికి మా ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోంది” అని ప్రధాని (PM Modi) అన్నారు. ఈ ఉత్సవం “మానవత్వం, భక్తి వేడుక”గా ప్రపంచ గుర్తింపు పొందాలని ఆకాక్షించారు. బీహార్ ఎన్నికలలో (Bihar Elections) మద్దతు కోసం పిలుపునిస్తూ, ఆయన తన ట్రేడ్‌మార్క్ నినాదమైన “ఫిర్ ఏక్ బార్, ఎన్డీఏ సర్కార్!” నినాదంతో ప్రజలను హోరెత్తించారు.
PM Modi | ఛత్ పాటలను ప్రోత్సహించడానికి కొత్త చొరవ
యువ తరాలలో సాంస్కృతిక పరిరక్షణను ప్రోత్సహించడానికి ప్రధానమంత్రి దేశవ్యాప్తంగా ఛత్ పాటల పోటీని ప్రకటించారు. “ఛత్ పాటల గొప్ప వారసత్వంతో యువత మరింత లోతుగా కనెక్ట్ అవ్వాలని మేము కోరుకుంటున్నాము. ఈ భక్తి పాటలు పండుగ విలువలను ఒక తరం నుండి మరొక తరానికి ముందుకు తీసుకువెళతాయి” అని మోదీ అన్నారు. ఈ పోటీలో భారతదేశం అంతటా ఉన్న కళాకారులు పాల్గొంటారని, “కొత్త స్వరాలు, కొత్త పాటలు, భక్తి కొత్త వ్యక్తీకరణలు ఉద్భవించడానికి” సహాయపడతారన్నారు.

