అక్షరటుడే, వెబ్‌డెస్క్ : PM Kisan Funds | దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది రైతులకు (Farmers) కేంద్ర ప్రభుత్వం మరోసారి శుభవార్త అందించింది. ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం కిసాన్) పథకం కింద 21వ విడతగా రూ. 2,000 చొప్పున నిధులు అక్టోబర్ 18న రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్టు సమాచారం.
దీపావళి పండుగకు (Diwali Festival) ముందు ఈ నగదు అందితే, రైతులకు ఇది నిజమైన పండుగ కానుక అవుతుందని కేంద్రం భావిస్తోంది. పీఎం కిసాన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం అర్హత ఉన్న ప్రతి ఒక్క రైతుకు ఏడాదికి ₹6,000 మద్దతుగా అందిస్తోంది. ఈ మొత్తాన్ని మూడు విడతలుగా ఏప్రిల్, ఆగస్టు, అక్టోబర్ నెలల్లో రూ.2,000 చొప్పున విడుదల చేస్తుంది.
PM Kisan Funds | దీపావళి ధమాకా..
ఇప్పటికే ఆగస్టు (August) నెలలో 20వ విడత నిధులు జమ చేసిన కేంద్రం, ఇప్పుడు 21వ విడత నగదు జమకు సిద్ధమవుతోంది. దీపావళి ఈ ఏడాది అక్టోబర్ 20న జరుపుకుంటుండటంతో, పండుగకు ముందు రైతులకు డబ్బు అందించేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది.ఇదిలా ఉండగా, సెప్టెంబర్ 22న జీఎస్టీ మార్పులు అమల్లోకి రానుండగా, బిహార్ ఎన్నికల నోటిఫికేషన్ (Bihar Election Notification) త్వరలో విడుదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (డీబీటి) కింద ఉన్న పథకాల్ని ముందుగానే అమలు చేయాలని చూస్తోంది. పీఎం కిసాన్ పథకం కింద నిధులు విడుదల కూడా ఈ చర్యలలో భాగమే.
అయితే, నిధులు జమ కాకపోవడానికి ప్రధాన కారణాలు రైతులు తప్పుగా KYC చేయకపోవడమే. ప్రభుత్వం డబ్బు విడుదల చేసినా, ఆధార్‌తో బ్యాంక్ ఖాతా లింక్ అయి లేకపోతే లేదా KYC పూర్తి చేయకపోతే నిధులు అకౌంట్‌లో పడవు. అలాంటి తప్పులు జరగకుండా ఉండేందుకు, రైతులు ముందుగా PM-KISAN అధికారిక వెబ్‌సైట్ (pmkisan.gov.in)లో లాగిన్ అయి తమ లబ్ధిదారుల స్టేటస్ను పరిశీలించుకోవాలి.
ఆధార్ నంబర్ లేదా రిజిస్ట్రేషన్ నంబర్ ఉపయోగించి స్టేటస్ తెలుసుకోవచ్చు. అలాగే ‘లబ్ధిదారుల జాబితా’ ద్వారా తమ గ్రామంలోని ఇతర రైతుల వివరాలను కూడా చూడవచ్చు.పీఎం కిసాన్ పథకం 2018 డిసెంబర్ 1న ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటివరకు 20 విడతలుగా దేశవ్యాప్తంగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమయ్యాయి. ఇప్పుడు అక్టోబర్‌లో 21వ విడతగా నగదు జమ చేయనున్నట్టు తెలుస్తోంది. 2 హెక్టార్లలోపు వ్యవసాయ భూమి కలిగిన రైతులు ఈ పథకానికి అర్హులు. ఇప్పటికీ కొత్తగా ఈ పథకంలో చేరాలనుకునే రైతులు వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేసుకోవచ్చు.
