అక్షరటుడే, వెబ్‌డెస్క్: Rajinikanth | ఒక నటుడు తన స్టైల్‌తో, శ్రమతో, నిబద్ధతతో ఐదు దశాబ్దాల సినీ ప్రయాణాన్ని పూర్తిచేయడం నిజంగా అరుదైన ఘనత. అలాంటి ఘనత రజనీకాంత్ సొంతం చేసుకున్నారు. 1975లో విడుదలైన ‘అపూర్వ రాగంగళ్’ సినిమాతో వెండితెరపై అడుగుపెట్టిన సూపర్ స్టార్ రజినీకాంత్ (Superstar Rajini Kanth), ఇప్పుడు 50 ఏళ్ల సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా అభిమానులు, ప్రముఖులు, సినీ ప్రముఖులు ఆయనకు అభినందనలు తెలుపుతున్నారు. ఈ ప్రత్యేక సందర్భాన్ని మరింత అద్భుతంగా మార్చిన విషయం ఏమిటంటే, ఆగస్టు 14న విడుదలైన రజినీకాంత్ కొత్త చిత్రం ‘కూలీ’ (Coolie Movie) విడుదల రోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 151 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి తమిళ సినిమా చరిత్రలో ఫస్ట్ డే హయ్యస్ట్ కలెక్షన్ రికార్డ్‌ను బద్దలుకొట్టింది.
Rajinikanth | 50 ఏళ్ల జర్నీ..
ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ (Sun Pictures) అధికారికంగా ప్రకటించింది. సూపర్ స్టార్ ర్యాంపేజ్‌కు ఇదొక నిదర్శనం మాత్రమే. బస్ కండక్టర్‌గా కెరీర్ ప్రారంభించిన రజినీకాంత్‌కి, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఉండటం గొప్ప విషయం. ఆయన నడక ఓ స్టైల్, కాల్ ఎగరేయడం ఓ స్టైల్, సిగరెట్ తిప్పడం ఓ స్టైల్.. ఇలా ఏది చేసినా తనకంటూ ప్రత్యేకత సంపాదించుకన్నారు. కర్ణాటకలో జన్మించి, తమిళ ప్రజల మనసులు గెలుచుకుని, తెలుగు, మలయాళం, హిందీ భాషల్లోనూ అశేష అభిమానగణం ఏర్పరచుకున్నాడు రజనీ. జపాన్, మలేషియా, సింగపూర్ వంటి దేశాల్లోనూ కల్ట్ ఫాలోయింగ్ కలిగిన అరుదైన భారతీయ నటుడిగా రజనీకాంత్ నిలిచారు.
ఈ ప్రత్యేక ఘట్టాన్ని పురస్కరించుకుని భారత ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) కూడా రజినీకాంత్‌కి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. “సినీ రంగంలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న రజినీకాంత్‌కు శుభాకాంక్షలు. ఆయన పాత్రలు ప్రేక్షకుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని కోరుతున్నాను” అని మోదీ తమిళం, ఇంగ్లీష్‌లో ట్వీట్ చేయడం విశేషం. అలాగే ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandra Babu Naidu) కూడా రజినీకాంత్‌కు ప్రత్యేక అభినందనలు తెలిపారు. రజినీకాంత్ 50ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అభినందనలు తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేశారు చంద్రబాబు.