అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Weather Updates | రాష్ట్రాన్ని వానలు వీడడం లేదు. మూడు రోజుల పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురవడంతో జన జీవనం స్తంభించిన విషయం తెలిసిందే.
భారీ వర్షాలతో అతలాకుతలం అయిన ప్రజలు ఇంకా తేరుకోలేదు. అయితే రాష్ట్రంలో ఇంకా వర్షాలు పడుతాయని అధికారులు చెబుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పలు ప్రాంతాల్లో శనివారం మోస్తరు వర్షాలు (Moderate Rains) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
Weather Updates | ఆ జిల్లాలకు..
తెలంగాణలోని సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట, ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, పెద్దపల్లి, మంచిర్యాల, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. అయితే ఇవి ఎక్కువ సేపు ఉండవని.. 15 నుంచి 20 నిమిషాల పాటు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. మిగతా జిల్లాల్లో తేలికపాటి చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది.
Weather Updates | హైదరాబాద్ నగరంలో..
హైదరాబాద్ (Hyderabad) నగరంలో సాయంత్రం వరకు వాతావరణం పొడిగా ఉంటుంది. ఆ తర్వాత పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం పడే ఛాన్స్ ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
Weather Updates | తేరుకోని గ్రామాలు
కామారెడ్డి, మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో ఇటీవల అతిభారీ వర్షాలు కురిసిన విషయం తెలిసింది. దీంతో వరద పోటెత్తింది. జలప్రలయం నుంచి ఇంకా చాలా గ్రామాలు తేరుకోలేదు. వందలాది గ్రామాల్లో రోడ్లు తెగిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో అధికారులు, స్థానికులు తాత్కాలికంగా రోడ్లు పునరుద్ధరించారు. ఇంకా కొన్ని గ్రామాలకు రాకపోకలు సాగడం లేదు. విద్యుత్ స్తంభాలు నేలకూలడంతో అధికారులు యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధణ పనులు చేపడుతున్నారు.