అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Munugodu MLA | కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కొంత కాలంగా సంచలన వ్యాఖ్యలతో కలకలం రేపుతున్నారు. మంత్రి పదవి రాలేదన్న అసంతృప్తిలో ఉన్న ఆయన సొంత పార్టీపై, ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy)తో పాటు ప్రభుత్వంపై ప్రజా తిరుగుబాటు తప్పదని వ్యాఖ్యానించే దాకా వెళ్లిపోయారు. రాజగోపాల్‌రెడ్డి అన్ని హద్దులు దాటుతున్నా కాంగ్రెస్ పార్టీలో మాత్రం కదలిక రావడం లేదు. ఆయనపై చర్యలు చేపట్టడం లేదు. గతంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న(MLC Teenmar Mallanna) విషయంలో వేగంగా స్పందించి వేటు వేసిన అధికార పార్టీ.. ఇప్పుడు కోమటిరెడ్డి వ్యవహారంలో వ్యవహరిస్తున్న వైఖరిపై సొంత పార్టీలోనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బీసీ నాయకుడి విషయంలో వేగంగా నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్.. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి(Komatireddy Rajagopal Reddy)పై మాత్రం ఆచితూచి వ్యవహరిస్తుండడం హస్తం పార్టీతో పాటు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
Munugodu MLA | కొరకరాని కొయ్యగా కోమటిరెడ్డి..
స్వయాన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సోదరుడు అయిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ(Congress Party)కి కొరకరాని కొయ్యగా మారారు. రెండోసారి జరిగిన మంత్రివర్గ విస్తరణ తర్వాత ఆయన సొంత పార్టీపై ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. మొదట్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు. కాంగ్రెస్‌లో చేరి గెలిస్తే మంత్రి పదవి ఇస్తామన్నారని, భువనగిరి ఎంపీ సీటు గెలిపిస్తే పదవి ఇస్తామన్నారని, కానీ ఇవ్వకుండా మోసం చేశారని ఆరోపించారు. మిగతా వాళ్లలా పదవులను అడ్డం పెట్టుకుని సంపాదించుకనే వాడిని కానని, ప్రజల కోసమే పదవి అడుగుతున్నానని తెలిపారు. ప్రభుత్వ నిర్ణయాలను సైతం పలుమార్లు తప్పుబట్టారు. కాళేశ్వరం అక్రమాలపై జస్టిస్ పీసీ ఘోష్ ఇచ్చిన నివేదికపై చర్చించేందుకు ఇటీవల ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించగా, దాన్ని కూడా తప్పుబట్టారు. రాష్ట్రంలో వరదలు వచ్చి ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ఇంత అర్జెంట్‌గా సమావేశాలు నిర్వహించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. పనికి రాని సమావేశాలకు తాను హాజరు కాబోనని, వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తానని ప్రకటించారు. ఇలా పలుమార్లు ఆయన కాంగ్రెస్ పార్టీని, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా వ్యవహరించారు.
Munugodu MLA | తిరుగుబాటు తప్పదు..
కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government)పై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తాజాగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. యువత తలుచుకుంటే రాష్ట్ర సర్కార్‌ను కూల్చేస్తారంటూ వ్యాఖ్యానించారు. యువతను ఉద్యోగాల పేరుతో ప్రభుత్వం తీవ్రంగా మోసం చేసిందని విమర్శించిన ఆయన.. అధికారంలోకి వస్తే 2 లక్షల ఉద్యోగాల భర్తీ చేస్తామన్న హామీని విస్మరించిందన్నారు. అలాగే గ్రూప్-1, గ్రూప్-2 పోటీ పరీక్షల ద్వారా యువతకు న్యాయం చేస్తామన్న హామీ నిలబెట్టుకోలేదన్నారు. గ్రూప్-1 పరీక్షల్లోఅవకతవకలు జరిగాయని.. ఈ అవకతవకలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. యువతతో ఆడుకున్న ప్రభుత్వాలు మనుగడ సాధించ లేవని,నేపాల్‌లో యువత తిరుగుబాటు చేసి ప్రభుత్వాన్ని కూల్చేసిన విషయాన్ని కోమటిరెడ్డి గుర్తు చేశారు. ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే నేపాల్ తరహాలో యువత తిరగబడి ప్రభుత్వాన్ని కూల్చేయడం ఖాయమంటూ హెచ్చరించారు. కోమటిరెడ్డి నేరుగా ప్రభుత్వంపై విమర్శలు చేస్తుండడం కాంగ్రెస్ పార్టీతో పాటు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
Munugodu MLA | చర్యలకు వెనుకడుగు..
కాంగ్రెస్ పార్టీని ఇప్పటికే ఎన్నోసార్లు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఎన్నోసార్లు ఇబ్బందుల్లోకి నెట్టారు. కానీ పార్టీ మాత్రం ఆయనపై చర్యలు తీసుకునేందుకు సాహసించట్లేదు. కోమటిరెడ్డి విషయంలో పార్టీ నాయకత్వం ఎందుకు స్పందించడం లేదన్నది అంతుచిక్కడం లేదు. ఆయనపై చర్యలు తీసుకునేందుకు ఎందుకు ధైర్యం చేయట్లేదో పార్టీ కేడర్(Party Cadre) కూడా ప్రశ్నిస్తోంది. పార్టీ గీత దాటుతున్నా కోమటిరెడ్డిపై చర్యలు తీసుకోవడానికి అధిష్టానం ఎందుకు వెనుకాడుతోందని కొందరు నేతలు ప్రశ్నిస్తున్నారు. మామూలు ఎమ్మెల్యేలు, నాయకులు మాట్లాడితే చర్యలు తీసుకునే క్రమశిక్షణ వ్యవహారాల కమిటీ రాజగోపాల్‌రెడ్డి విషయంలో పట్టించుకోక పోవడాన్ని ప్రస్తావిస్తున్నారు గతంలో తీన్మార్ మల్లన్న విషయంలో వేగంగా నిర్ణయం తీసుకుని ఆయనను వేలేసినప్పుడు, కోమటిరెడ్డి విషయంలో అంత వేగంగా ఎందుకు నిర్ణయం తీసుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. అంటే బీసీల విషయంలో ఒక రకంగా, రెడ్ల విషయంలో మరో రకంగా వ్యవహరించడం సరికాదని సూచిస్తున్నారు.