అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy SP | మొబైల్ కేంద్రంగా సైబర్ మోసాలు జరుగుతున్నాయని ఎస్పీ రాజేష్ చంద్ర (SP Rajesh Chandra) అన్నారు. బాధితులు పోగొట్టుకున్న 112 మొబైళ్లను (mobile phones) రికవరీ చేసి బాధితులకు అప్పగించారు. ఈ సందర్భంగా ఎస్పీ రాజేష్ చంద్ర మీడియాతో మాట్లాడారు. మొబైల్ ఫోన్ ప్రతి ఒక్కరికీ నిత్యావసరంగా మారిందన్నారు.
అందులో వ్యక్తిగత సమాచారం, బ్యాంకింగ్ వివరాలు, పాస్వర్డ్లు, సోషల్ మీడియా అకౌంట్లు (social media accounts), వ్యక్తిగత ఫోటోలు వంటి కీలకమైన డేటా ఉంటుందన్నారు. మొబైల్ ఫోన్ పోగొట్టుకోవడం అనేది కేవలం పరికరాన్ని కోల్పోవడమే కాకుండా, వ్యక్తిగత, ఆర్థిక భద్రతకు కూడా ప్రమాదంగా మారుతుందని పేర్కొన్నారు. మొబైల్ ఫోన్ పోయినా, చోరీకి గురైనా వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వాలని సూచించారు. సిమ్ కార్డును బ్లాక్ చేసి అదే నంబర్‌తో కొత్త సిమ్ తీసుకోవాలన్నారు.
అనంతరం సీఈఐఆర్ వెబ్సైట్లో (CEIR website) ఐఎంఈఐ నంబర్‌ను బ్లాక్ చేయడం ద్వారా ఫోన్‌ను సులభంగా గుర్తించి తిరిగి పొందే అవకాశం ఉంటుందని తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి ఆధ్వర్యంలో ఆరుగురు కానిస్టేబుళ్లతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి నిరంతరంగా మొబైల్ రికవరీ చర్యలు (mobile recovery operations) చేపడుతున్నామని తెలిపారు. ఈ బృందం ద్వారా ప్రతి నెలా 150కి పైగా మొబైల్ ఫోన్లు రికవరీ చేస్తున్నామని వివరించారు. ఈ సంవత్సరం ఇప్పటివరకు సుమారు రూ.3 కోట్ల విలువైన 1,834 మొబైల్ ఫోన్లను బాధితులకు అందజేశామని పేర్కొన్నారు.
ఇటీవల ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా గత 15 రోజుల్లో రూ.18 లక్షల విలువైన 112 మొబైల్ ఫోన్లు రికవరీ చేయడం జరిగిందని తెలిపారు. పోర్టల్ ప్రారంభం నుంచి ఇప్పటివరకు జిల్లాలో మొత్తం రూ.6.85 కోట్ల విలువైన 4,281 మొబైల్ ఫోన్లు రికవరీ చేసి బాధితులకు అందజేయడం జరిగిందని వివరించారు. రికవరీ చేసిన మొబైల్ ఫోన్ల వివరాలు సంబంధిత బాధితులకు తెలియజేస్తారన్నారు. మొబైల్ బాధితులు జిల్లా పోలీస్ కార్యాలయానికి వచ్చి అవసరమైన ధృవపత్రాలు చూపించి తమ మొబైల్ ఫోన్లను స్వీకరించవచ్చని తెలిపారు. మొబైల్ ఫోన్ల ద్వారానే సైబర్ మోసాలు ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అనుమానాస్పద లింకులు, కాల్స్, మెసేజ్‌లకు స్పందించవద్దని ఎస్పీ సూచించారు.