అక్షరటుడే, వెబ్‌డెస్క్ : MMTS Trains | హైదరాబాద్ నగరంలో న్యూ ఇయర్ (New Year) వేడుకలను ఘనంగా జరుపుకోడానికి ప్రజలు సిద్ధం అయ్యారు. డిసెంబర్ 31న నగరవ్యాప్తంగా పార్టీలు, ఈవెంట్లు జోరుగా సాగనున్నాయి.
నగరంలో ప్రతి ఏటా కొత్త సంవత్సరం సంబరాలు ఘనంగా నిర్వహిస్తారు. డిసెంబర్ 31న రాత్రి 12 గంటలకు ఈ ఏడాదికి వీడ్కోలు పలుకుతూ.. కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతారు. పెద్ద ఎత్తున కేక్‌లు కట్ చేసి, టపాసులు పేల్చి వేడుకలు జరపుకుంటారు. ఆ రోజు మద్యం ఏరులై పారుతోంది. ఇప్పటికే ప్రభుత్వం డిసెంబర్ 31న మద్యం దుకాణాలు, బార్లకు అర్ధరాత్రి వరకు నిర్వహించడానికి అనుమతి ఇచ్చింది. అయితే రాత్రిపూట పార్టీలు చేసుకొని ఇంటికి వెళ్లే వారికి రైల్వే శాఖ (railway department) కీలక వార్త చెప్పింది.
MMTS Trains | ఎంఎంటీస్ రైళ్లు
డిసెంబర్ 31న అర్ధరాత్రి తర్వాత ఎంఎంటీఎస్ ప్రత్యేక రైళ్లను (special MMTS trains) నడపాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. లింగంపల్లి నుంచి ఎంఎంటీఎస్ ట్రైన్ అర్ధరాత్రి 1:15 గంటలకు బయలుదేరి 1:55 గంటలకు నాంపల్లి రైల్వే స్టేషన్ చేరుకుంటుంది. చందానగర్, హఫీజ్‌పేట్, హైటెక్ సిటీ, బోరబండ, భరత్ నగర్, బేగంపేట, ఖైరతాబాద్, లక్డీకాపూల్ సహా పలు కీలక రైల్వే స్టేషన్లలో ఈ రైలు ఆగుతుంది. లింగంపల్లి నుంచి ఫలక్‌నుమా వరకూ రాత్రి 1:30 గంటలకు మరో స్పెషల్ ఎంఎంటీఎస్ ట్రైన్ నడపనున్నారు. కొత్త సంవత్సర వేడుకల అనంతరం ప్రజలను గమ్య స్థానాలకు చేర్చడానికి స్పెషల్ ట్రైన్స్‌ను నడపాలని రైల్వే నిర్ణయించింది. ఆ రోజు రద్దీ అధికంగా ఉండనుంది. ఆర్టీసీ సైతం రాత్రి వరకు బస్సు సర్వీసులు నడిపే అవకాశం ఉంది. అలాగే మెట్రో రైలు సర్వీసులను కూడా అర్ధరాత్రి వరకు పొడగించనున్నారు. దీనిపై త్వరలో ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
MMTS Trains | తాగి నడిపితే అంతే..
నగరంలో న్యూ ఇయర్ సందర్భంగా జోరుగా మందు పార్టీలు జరుగుతాయి. దీంతో పోలీసులు ప్రత్యేక డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించనున్నారు. ఈ నెల 24 నుంచే నగర వ్యాప్తంగా నిత్యం తనిఖీలు చేపడుతున్నారు. డిసెంబర్ 31న రాత్రి స్పెషల్ టీంలతో తనిఖీలు చేపడుతామని ఇప్పటికే సీపీ సజ్జనార్ ప్రకటించారు. దీంతో మందుబాబులు తాగి వాహనాలు నడిపి ఇబ్బందులు పడొద్దు. ఆర్టీసీ బస్సులు, ట్రైన్లు, క్యాబ్‌ల ద్వారా గమ్యస్థానాలకు సురక్షితంగా చేరుకోవాలి.