అక్షరటుడే, వెబ్‌డెస్క్: Mlc kavitha | బీఆర్‌ఎస్‌లో ముసలం పుట్టింది. ఎమ్మెల్సీ కవిత(Mlc kavitha).. తన తండ్రి, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్(KCR)కు రాసిన లేఖ బయటకు రావడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించింది.
ఇటీవల గులాబీ పార్టీలో సంక్షోభం నెలకొందన్న బీజేపీ, కాంగ్రెస్ ఆరోపణలకు బలం చేకూర్చుతూ కవిత లేఖ బయట పడడం కలకలం రేపింది. వరంగల్ సభ(Warangal Sabha) తర్వాత కవిత రాసినట్లుగా చెబుతున్న లేఖ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మై డియర్ డాడీ అని లేఖను ప్రారంభించిన కవిత.. అందులో చాలా విషయాలను ప్రస్తావించారు. తన అసంతృప్తిని వెల్లగక్కుతూ, పార్టీలో నెలకొన్న పరిణామాలపై కేసీఆర్‌కు వివరించారు. వరంగల్ సభ విజయవంతమైందంటూనే కొన్ని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. పాజిటివ్, నెగెటివ్ ఫీడ్‌బ్యాక్ అంటూ కవిత లేఖలో ప్రస్తావించిన అంశాలు ఇప్పుడు సంచలనంగా మారాయి.
Mlc kavitha | బీజేపీ విషయంలో మౌనమెందుకు?
బీజేపీ విషయంలో బీఆర్ఎస్ మౌనంగా ఉండడంపై కవిత సహించలేకపోయారు. అసలు బీజేపీతో పార్టీ వైఖరి ఏమిటో స్పష్టత ఇవ్వకపోవడంపై ఆమె కేసీఆర్‌ను నిలదీశారు. వరంగల్ సభ(Warangal Sabha)లో ఈ అంశంపై కేడర్‌కు ఎందుకు క్లారిటీ ఇవ్వలేకపోయారని ప్రశ్నించారు. వరంగల్ సభలో బీజేపీపై రెండు నిమిషాలే మాట్లాడడంతో అనేక అనుమానాలు కలుగుతున్నాయని కవిత ఎత్తి చూపారు. ముస్లింలకు వ్యతిరేకంగా బీజేపీ తీసుకొచ్చిన వక్ఫ్ బిల్లు(Waqf Bill)పై ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు. బీజేపీ వల్ల తాను తీవ్ర ఇబ్బందులు పడ్డాడని ఆమె గుర్తు చేశారు.
అసలు బీజేపీతో పొత్తు ఉంటుందా? ఆ పార్టీతో మన వైఖరి ఏమిటో స్పష్టత ఇవ్వాల్సి ఉందని పేర్కొన్నారు. బీజేపీతో పొత్తుపై సిల్వర్ జూబ్లీ సభ(Brs Silver Jubilee Assembly)లో క్లారిటీ ఇవ్వలేదని తెలిపారు. బీజేపీపై ఇంకా బలంగా మాట్లాడాల్సి ఉండాల్సిందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. బీజేపీతో బీఆర్‌ఎస్ పొత్తు పెట్టుకుంటారేమో అనే చర్చ మొదలైందని తెలిపారు. నేను సఫర్ అయ్యాకదా.. బహుశా అందుకని కావొచ్చని, బీజేపీని ఇంకొంచెం టార్గెట్ చేయాల్సిందని అభిప్రాయం వ్యక్తం చేశారు. బీజేపీ ఆల్టర్‌నేటివ్ అనే ఆలోచనను మన కేడర్ చెబుతోందని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మనం పోటీ చేయకుండా.. బీజేపీకి హెల్ప్ చేశామనే మెసేజ్ కాంగ్రెస్ బలంగా తీసుకెళ్లిందని కేసీఆర్ దృష్టికి తీసుకొచ్చారు.
Mlc kavitha | పార్టీలో యాక్సెస్ ఇవ్వడం లేదు
బీఆర్‌ఎస్(BRS)లో తనకు సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదని కవిత ఆరోపించారు. అనేక అంశాలపై పోరాడుతున్న తనకు పార్టీ నుంచి మద్దతు కరువైందని కవిత వాపోయారు. ఎస్సీ వర్గీకరణ (SC classification), బీసీ రిజర్వేషన్ల బిల్లు(BC Reservations Bill)తో పాటు ఇతర అంశాలపై తాను పోరాడుతుంటే మద్దతు ఇవ్వకపోవడంపై ఆమె కేసీఆర్‌ను ప్రశ్నించారు. పార్టీ లీడర్స్‌తో తనకు యాక్సెస్ ఇవ్వడం లేదని ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణపై మొన్నటి సభలో నోరు విప్పకపోవడంపై కవిత ప్రశ్నించారు. పాత ఇన్‌చార్జీలకే బాధ్యతలు అప్పగించడంపై ఆమె సూటిగా ప్రశ్నలు లేవనెత్తారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై ఎందుకు స్పందించడం లేదని కవిత కేసీఆర్‌ను ప్రశ్నించారు. రిజర్వేషన్లపై తాను పోరాటం చేస్తుంటే వరంగల్ సభలో ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నించారు. బీసీ సామాజిక వర్గాలను ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తుంటే పార్టీ తరఫున ఎందుకు మద్దతు ఇవ్వలేదని అడిగారు.
తెలంగాణ తల్లి విగ్రహం మార్పు, తెలంగాణ గీతం మార్పుపై మోటివేట్ చేయడంలో విఫలమయ్యారని తెలిపారు. KCR యాక్సెస్ దొరకడం లేదని చాలా మంది జడ్పీ ఛైర్మన్లు, ఎమ్మెల్యే స్థాయి నేతలు బాధ పడుతున్నారని లేఖలో పేర్కొన్నారు. అందరికి అందుబాటులో ఉండేలా ప్రయత్నించండి అంటూ కవిత లేఖలో కోరారు. వరంగల్ సభలో ఉద్యమనేతలకు సరైన ప్రాధాన్యం దక్కలేదని కవిత ఎత్తి చూపారు. 2001 నుంచి మీతో ఉన్నవారికి మాట్లాడే అవకాశం ఇస్తే బావుండేదని అభిప్రాయపడ్డారు. పాత ఇన్‌చార్జ్‌లకే బాధ్యతలు ఇవ్వడం కూడా కేడర్‌కు నచ్చలేదని కేసీఆర్ దృష్టికి తీసుకొచ్చారు. స్థానిక ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నవారికి.. నేరుగా పార్టీ ఆఫీసు నుంచే బీ ఫామ్స్ ఇవ్వాలని కోరారు.