అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Governor Quota MLCs | రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా కోదండరాం, అజారుద్దీన్ ఎంపిక చేసింది. ఈ మేరకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. కేబినెట్ నిర్ణయాన్ని గవర్నర్‌కు పంపనున్నారు. ఆయన ఆమోదం తెలిపిన అనంతరం ఇద్దరు ఎమ్మెల్సీలుగా నియామకం కానున్నారు.
Governor Quota MLCs | పదవి కోల్పోయిన కోదండరాం, అమీర్ అలీ ఖాన్
గవర్నర్ కోటాలో ఎన్నికైన ఇద్దరు ఎమ్మెల్సీల నియామకంపై ఇటీవల సుప్రీం కోర్టు సంచలన తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. కోదండరాం (Kodandaram), అమీర్ అలీ ఖాన్ (Aamir Ali Khan) ఎమ్మెల్సీల నియామకం రద్దు చేస్తూ తీర్పు వెల్లడించింది. వీరిద్దరూ గతంలో గవర్నర్ కోటా(Governor Quota)లో ఎన్నికైన ఎమ్మెల్సీలుగా ఎన్నికైన విషయం తెలిసిందే. కాగా.. గత ప్రభుత్వం దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణను ఎంపిక చేయగా.. అప్పటి గవర్నర్ తిరస్కరించారు. ఇంతలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో కోదండరాం, అమీర్ అలీ ఖాన్‌ను నియమించింది. కాగా.. వీరి నియామకాన్ని సవాల్ చేస్తూ దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ సుప్రీంను ఆశ్రయించారు. విచారణ జరిపిన న్యాయస్థానం కోదండరాం, అమీర్ అలీ ఖాన్ నియామకాన్ని రద్దు చేస్తూ తీర్పు చెప్పింది.
కాగా.. వీరి నియామకం రద్దుపై సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఇటీవల ఉస్మానియా యూనివర్సిటీలో స్పందించారు. ప్రొఫెసర్ కోదండరాంను తిరిగి ఎమ్మెల్సీగా నియమిస్తామని ఎవరు అడ్డుకుంటారో చూస్తానని వ్యాఖ్యానించారు. తాజాగా.. కోదండరాంను గవర్నర్ కోటాలో మరోసారి ఎమ్మెల్సీగా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కాగా.. అమీర్ అలీఖాన్ స్థానంలో మాజీ క్రికెటర్, కాంగ్రెస్ నేత అజరుద్దీన్ (Congress Leader Azharuddin)కు చోటు కల్పించారు. ఆయన గత అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలైన విషయం తెలిసిందే.
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ నుంచి గెలుపొందిన మాగంటి గోపినాథ్ అకాల మరణంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ స్థానం నుంచి మరోసారి టికెట్ ఆశిస్తున్న అజారుద్దీన్‌కు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వడం గమనార్హం. కాగా.. ఈ స్థానంలో టికెట్ ఎవరికి ఇస్తారనే అంశం ఆసక్తికరంగా మారింది.