HomeతెలంగాణMLC Kavitha | ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు.. హరీశ్‌, సంతోష్ వల్లే కేసీఆర్​పై సీబీఐ...

MLC Kavitha | ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు.. హరీశ్‌, సంతోష్ వల్లే కేసీఆర్​పై సీబీఐ ఎంక్వైరీ..

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: MLC Kavitha | ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌  పక్కనున్న వారి వల్లే ఇవాళ ఆయనకు చెడ్డపేరు వచ్చిందన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ (BRS Party) ముఖ్య నేతలు హరీశ్‌ రావు, సంతోష్‌ రావు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కలిసి కేసీఆర్‌పై కుట్ర చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు.

కాళేశ్వరం ఎపిసోడ్​లో కేసీఆర్​కు అవినీతి మరక అంటడానికి ముగ్గురు వ్యక్తులు కారణమని ఆరోపించారు. హరీశ్‌, సంతోష్​తో పాటు మేఘా కృష్ణారెడ్డి (Megha Krishna Reddy) కారణమన్నారు. కేసీఆర్​పై కుట్రపూరితంగా అభాండాలు వేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్‌ పేరు చెప్పుకుని అనేక అక్రమాలకు పాల్పడ్డారని వారి వల్ల ఇవాళ ఈ పరిస్థితి తలెత్తిందన్నారు. కాళేశ్వరం నిర్మాణంలో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణకు ఆదేశించిన నేపథ్యంలో కవిత సోమవారం విలేకరులతో మాట్లాడుతూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏం తప్పు చేశారని కేసీఆర్‌ ఈ వయస్సులో సీబీఐ ఎంక్వైరీ (CBI Inquiry) ఎదుర్కోవాలని ప్రశ్నిస్తూ కంటతడి పెట్టుకున్నారు. కేసీఆర్‌ బిడ్డగా తన కడుపు తరుక్కుపోతుందన్నారు.

MLC Kavitha | వాళ్లకు డబ్బుపైనే ధ్యాస

ఎవరి కోసం ఎందువల్ల కేసీఆర్​కు అవినీతి మరక అంటిస్తున్నారని ప్రశ్నించారు. ఐదేళ్లు ఇరిగేషన్‌ మంత్రిగా ఉన్న హరీశ్‌రావు (Harish Rao) పాత్ర లేదా? అని ప్రశ్నించారు. పెద్ద పెద్ద కాంట్రాక్టర్లతో కుమ్మక్కై హరీశ్‌రావు, సంతోష్‌ రావు డబ్బు పోగేసుకున్నారని ఆరోపించారు. నాపై ఎన్ని కుట్రలు చేసినా, ఏం మాట్లాడినా నోరు మెదపలేదని, కానీ.. ఇవాళ తన తండ్రిపై ఎంక్వైరీ వేయడంతో కడుపు తరుక్కు పోతోందన్నారు. కేసీఆర్​కు తిండి మీద, డబ్బు మీద ధ్యాస లేదని కవిత తెలిపారు. ఆయనకు తెలంగాణపైనే ధ్యాస అని చెప్పారు. కానీ ఆయన పక్కనున్న ఇద్దరు వ్యక్తులకు డబ్బు మీదే ధ్యాస అని వెల్లడించారు. కేసీఆర్​కు జనం మీద ధ్యాస ఉంటే, హరీశ్‌, సంతోష్‌, మేఘా కృష్ణారెడ్డికి డబ్బు మీద దృష్టి అని వ్యాఖ్యానించారు. అందుకే మొదటి సారి నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న హరీశ్‌ రావుకు రెండో సారి ఆ బాధ్యతలు అప్పగించలేదన్నారు.

MLC Kavitha | వారి వెనుక రేవంత్

హరీశ్‌, సంతోష్‌ (Santosh Rao) వెనుక ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఉన్నారని కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. వారి ముగ్గురికి లోపాయికారీ ఒప్పందం ఉందన్నారు. అందుకే రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) హరీశ్‌ రావు, సంతోష్‌ రావును ఏమని అనరని తెలిపారు. వాస్తవానికి హరీశ్, సంతోష్‌ వల్లే కేసీఆర్ ఇవాళ అవినీతి ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. కేసీఆర్​ను బద్నాం చేసే కుట్ర జరుగుతోందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో చిన్నభాగం కొట్టుకుపోతే మొత్తం ప్రాజెక్టు కొట్టుకుపోయినట్లు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కాళేశ్వరంలో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టులు చిన్న భాగమేనని తెలిపారు. మూడు పిల్లర్లు కుంగిపోతే మొత్తం కొట్టుకుపోయినట్లు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

MLC Kavitha | పార్టీ ఉంటే ఎంత.. పోతే ఎంత?

కేసీఆర్‌ పక్కనున్న వారే తనపై అనేక కుట్రలకు పాల్పడ్డారని కవిత (MLC Kavitha) ఆరోపించారు. సోషల్‌ మీడియాలో దుష్ప్రచారం చేయిస్తూ తనకు నిద్ర లేకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా కూడా తాను ఏనాడూ నోరు తెరవలేదని, ఎవరి పేర్లు బయటకు చెప్పలేదన్నారు. కానీ, ఇవాళ కేసీఆర్​కు అవినీతి మరక అంటించే ప్రయత్నం చేస్తుంటే వారి పేర్లు బయటకు చెప్పక తప్పడం లేదన్నారు.

తన వ్యాఖ్యలతో బీఆర్​ఎస్‌ పార్టీకి నష్టం జరిగితే జరుగొచ్చు కానీ, కేసీఆర్‌(KCR) దాకా వచ్చాక మాట్లాడకుండా ఎలా ఉంటానని ప్రశ్నించారు. కేసీఆర్‌ మీద సీబీఐ విచారణ వేశాక తొక్కలో పార్టీ ఉంటే ఎంత.. పోతే ఎంత? అని వ్యాఖ్యానించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో నష్టం జరిగితే జరుగుతుండొచ్చు కానీ, తాను మాత్రం మాట్లాడడం ఆపేది లేదని చెప్పారు. ఇప్పటికైనా బీఆర్​ఎస్‌ నేతలు వాస్తవాలు తెలుసుకోవాలని హితవు పలికారు.