అక్షరటుడే, వెబ్‌డెస్క్: MLC Kavitha | బీసీ రిజర్వేషన్ల సాధన కోసం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kalvakuntla Kavitha) చేపట్టిన దీక్ష ముగిసింది. సోమవారం ఉదయం ఆమె హైదరాబాద్లోని ఇందిరాపార్క్ వద్ద నిరాహార దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. అయితే తాము 72 గంటల పాటు దీక్ష చేపడతామని ఆమె తెలిపారు. కానీ పోలీసులు సాయంత్రం 6 గంటల వరకే అనుమతి ఇచ్చారు. దీంతో ఆమె కోర్టును ఆశ్రయించారు. కోర్టు కూడా ఆరు గంటలలోపు దీక్ష ముగించాలని చెప్పినట్లు తెలిసింది. దీంతో ఆమె దీక్ష విరమించారు.
కోర్టు ఆదేశాలను గౌరవిస్తూ దీక్షను ఇంతటితో ముగిస్తున్నట్లు కవిత తెలిపారు. బీసీ రిజర్వేషన్లు (BC reservations) అమలు చేయకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే ఎలా ఆపాలో తమకు తెలుసని ఆమె అన్నారు. బీసీ బిల్లు సాధన కోసం ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామన్నారు. కాగా సాయంత్రం ఆరు కాగానే పోలీసులు జాగృతి కార్యకర్తలను అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించారు. మరో వైపు వర్షం రావడంతో దీక్ష స్థలి వద్ద కార్యకర్తలు ఇబ్బందులు పడ్డారు.