అక్షరటుడే, వెబ్‌డెస్క్ : MLC Kavitha | బీఆర్ఎస్కు చెందిన కొందరు తనను తిట్టిస్తున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kalvakuntla Kavitha) సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే యావత్ తెలంగాణ ఖండించిందని కవిత పేర్కొన్నారు. అయితే బీఆర్ఎస్ నాయకులు మాత్రం స్పందించడం లేదన్నారు. ఓ లిల్లిపుట్ నాయకుడు తనను విమర్శించడం ఏమిటని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు.
మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి (MLA Jagadish Reddy) కవిత గురించి ఇటీవల పలు వ్యాఖ్యలు చేశారు. ఆమె బీఆర్ఎస్లో ఉంటే ఎమ్మెల్సీ అని లేకపోతే ఏమి కాదన్నారు. ఆమె గురించి మాట్లాడటం టైమ్ వేస్ట్ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలపై కవిత పరోక్షంగా స్పందించారు. లిల్లీపుట్ నాయకుడు నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీని నాశనం చేశారని కవిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కన్ను లొట్టపోయి గెలిచిన సదరు నాయకుడు.. ఎప్పుడు ప్రజా పోరాటాల్లో పాల్గొనలేదన్నారు. బీఆర్ఎస్కు ఆయనకు ఏం సంబంధం అని ప్రశ్నించారు. పార్టీకి సంబంధం లేని వ్యక్తితో తనపై ఆరోపణలు చేయిస్తున్నారన్నారు. నిన్న మొన్న పార్టీలోకి వచ్చిన చోటా మోటా లీడర్లతో తనను తిట్టిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అయితే వారి వెనుక బీఆర్ఎస్కు చెందిన పెద్ద నాయకుడు ఉన్నట్లు కవిత ఆరోపించారు. సమయం వచ్చినప్పుడు అందరి పేర్లు బయట పెడతానని స్పష్టం చేశారు.
MLC Kavitha | 72 గంటలపాటు నిరాహార దీక్ష
బీసీ రిజర్వేషన్ల (BC reservations) సాధన కోసం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) సోమవారం నుంచి 72 గంటల పాటు నిరవధికంగా నిరాహార దీక్ష చేపట్టనున్నారు. ఈ నెల 4, 5, 6 తేదీల్లో దీక్ష చేపట్టడానికి అనుమతి ఇవ్వాలని ఆమె పోలీసులను కోరారు. అయితే పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో కవిత హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు నుంచి అనుమతి వస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
స్థానిక సంస్థలతో పాటు, విద్యా ఉద్యోగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కవిత డిమాండ్ చేశారు. ఈ మేరకు తెలంగాణ జాగృతి (Telangana Jagruti) ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు. ఆందోళన కార్యక్రమాలు చేపట్టడంతో పాటు 72 గంటల పాటు తాను నిరాహార దీక్ష చేస్తున్నట్లు కవిత తెలిపారు. ప్రభుత్వం తనకు అనుమతి ఇవ్వాలని కోరారు.