అక్షరటుడే, వెబ్‌డెస్క్ : MLC Kavitha | రాష్ట్ర రాజకీయాలు రోజురోజుకు హీట్ ఎక్కుతున్నాయి. బీసీ రిజర్వేషన్లు, కాళేశ్వరం నివేదికపై రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం జోరుగా చర్చ సాగుతోంది. బీసీ రిజర్వేషన్ల అంశంపై అన్ని పార్టీలు ఆందోళనల బాట పట్టాయి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బీసీ రిజర్వేషన్ల (BC Reservations) కోసం నిరాహార దీక్ష ప్రారంభించారు.
తాము అధికారంలోకి వస్తే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. ఈ మేరకు అసెంబ్లీలో బిల్లులు ఆమోదించి కేంద్రానికి పంపింది. అయితే కేంద్రం బిల్లులకు ఆమోదం తెలపకపోవడంతో కాంగ్రెస్ ఈ నెల 6న ఢిల్లీలో ధర్నా చేపట్టడానికి సిద్ధమైంది. మరోవైపు బీఆర్ఎస్ (BRS) సైతం ఈ నెల 8న కరీంనగర్లో బీసీల సభ నిర్వహించనుంది. తాజాగా ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ దీక్షను ప్రారంభించారు.
MLC Kavitha | 72 గంటల పాటు..
కాంగ్రెస్ (Congress) ఇచ్చిన మాట ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు, విద్యా ఉద్యోగాల్లో 42శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేస్తున్నారు. కేంద్రంపై ఒత్తిడి తీసుకు వచ్చి బీసీ రిజర్వేషన్ బిల్లులను తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాలని ఆమె పేర్కొన్నారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని ఇందిరా చౌక్ వద్ద నిరాహార దీక్షను సోమవారం ఉదయం ప్రారంభించారు. 72 గంటల పాటు ఆమె దీక్ష చేయనున్నారు. దీక్ష ప్రారంభించే ముందు ఆమె తన భర్త అనిల్‌తో కలిసి ఇంట్లో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అత్తమామల ఆశీర్వాదం తీసుకొని దీక్ష స్థలికి బయలు దేరారు.