అక్షరటుడే, కామారెడ్డి : Kalvakantla Kavitha | తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత కామారెడ్డి పర్యటన ఉద్రిక్తంగా మారింది. అమృత్ గ్రాండ్ హోటల్లో మీడియా సమావేశం అనంతరం రైల్వే గేట్ వద్ద ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి (Ambedkar Statue) పూలమాల వేయడానికి వచ్చిన కవిత అకస్మాత్తుగా రైల్వే ట్రాక్‌పైకి చేరుకుని భైఠాయించారు.
Kalvakantla Kavitha | 42శాతం రిజర్వేషన్ ఇవ్వాల్సిందే..
కామారెడ్డిలో (Kamareddy) ప్రకటించిన బీసీలకు 42శాతం రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అరగంటకు పైగా ట్రాక్‌పై భైఠాయించి నిరసన తెలిపారు. రైలు వచ్చే సమయం అయిందని ధర్నా విరమించాలని పోలీసులు విజ్ఞప్తి చేసినా కవిత ససేమిరా అన్నారు. కామారెడ్డి సబ్ డివిజన్ ఏఎస్పీ చైతన్య రెడ్డి (ASP Chaitanya Reddy) రైల్వేట్రాక్ వద్దకు చేరుకుని సముదాయించారు. అయినా భీష్మించుకుని కూర్చోవడంతో పోలీసులు భారీగా చేరుకుని కవితను అరెస్ట్ చేయడానికి ప్రయత్నించారు.
దీంతో జాగృతి కార్యకర్తలు కవిత (Kalvakantla Kavitha) చుట్టూ వలయంగా నిలబడి పోలీసులను అడ్డుకున్నారు. అరగంట పాటు ట్రాక్‌పై ఉద్రిక్తత చోటు చేసుకుంది. కార్యకర్తల అడ్డగింతల మధ్య పోలీసులు భారీ బందోబస్తు మధ్య కవితను అరెస్ట్ చేసి వాహనంలో తరలించారు. అయినా కార్యకర్తలు పోలీసు వాహనాన్ని వెంబడించారు. కవితను అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న వాహనానికి అడ్డుగా పడుకుని నిరసన తెలపగా.. మహిళా కార్యకర్తలను పక్కకు తప్పించారు. అనంతరం కవితను అక్కడినుంచి తరలించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. బీసీలకు ఇచ్చిన హామీ ప్రకారం రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణలోని (Telangana) బీజేపీ ఎంపీలు రాజీనామా చేసి బీసీ బిల్లు అమలయ్యేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు.
కవిత చేతికి గాయం..
రైల్ రోకో చేస్తున్న కవితను పోలీసులు అరెస్ట్ చేస్తున్న క్రమంతో ఆమె కుడిచేతికి గాయమైంది. ఓవైపు కార్యకర్తలు మరోవైపు పోలీసుల పెనుగులాటలో కవిత చేతికి దెబ్బతగిలింది. పోలీసులు అలాగే ఆమెను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
