అక్షరటుడే, కామారెడ్డి: Shabbir Ali | కామారెడ్డి నియోజకవర్గ ప్రజలు ఎంతో నమ్మకంతో గెలిపిస్తే పట్టణ అభివృద్ధిని ఎమ్మెల్యే పూర్తిగా పక్కన పెట్టేశారని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ (Government advisor Shabbir Ali) విమర్శించారు. పట్టణంలోని పలు వార్డుల్లో ఆదివారం సుమారు రూ.2.5 కోట్లతో చేపట్టనున్న బీటీ రోడ్లు, సీసీ రోడ్లు, కల్వర్టుల నిర్మాణంతో పాటు, అమృత్ పథకం కింద తాగునీటి పైపులైన్ల విస్తరణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.
Shabbir Ali | కామారెడ్డి అభివృద్ధే లక్ష్యంగా..
ఈ సందర్భంగా షబ్బీర్‌అలీ మాట్లాడుతూ.. కామారెడ్డి పట్టణ సమగ్ర అభివృద్ధే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం (Congress government) ముందుకు సాగుతోందన్నారు. ప్రజల ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యే పట్టణ అభివృద్ధిపై నిర్లక్ష్య ధోరణి అవలంభిస్తున్నారన్నారని విమర్శించారు. ప్రజల సమస్యలను పరిష్కరించడం కంటే రాజకీయ ప్రయోజనాలకే ఆయన ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. పట్టణంలో మౌలిక సదుపాయాల కల్పనలో ఆయన వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ప్రజా ప్రతినిధిగా అందరినీ సమదృష్టితో చూడాల్సింది పోయి కేవలం ప్రోటోకాల్ కులాలు, మతాలకు మాత్రమే ప్రాధాన్యమిస్తూ వర్గాల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. సమాజంలో సామరస్యాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరించడం ఒక ఎమ్మెల్యేకు తగదన్నారు.
Shabbir Ali | కేంద్రం నుంచి నయాపైసా తేకపోయినా..
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ కామారెడ్డి పట్టణ అభివృద్ధికి అర్ధ రూపాయి కూడా ఎమ్మెల్యే తీసుకురాలేకపోయారని దుయ్యబట్టారు. చేసిన పనులు, సాధించిన అభివృద్ధిని చూయించి ఓట్లు అడగాలి తప్ప, అభివృద్ధి చేయకుండా ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారన్నారు. ప్రజలు ఆయన డ్రామాలను గమనిస్తున్నారని తెలిపారు. కామారెడ్డి అభివృద్ధిని విస్మరించిన ఎమ్మెల్యేను నిలదీయాల్సిన సమయం వచ్చిందన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో సొంత నిధులతో పట్టణాన్ని అభివృద్ధి చేస్తానని గొప్పలు చెప్పారని, ఆ అభివృద్ధి ఎటు పోయిందని ప్రశ్నించారు. మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు ప్రజలంతా ఆయనను నిలదీయాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, మాజీ వార్డు కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Shabbir Ali | మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో భేటీ
నిజామాబాద్ జిల్లా పర్యటనకు వెళ్తున్న రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని (Minister Uttam Kumar Reddy) ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ మార్గమధ్యలో కలిశారు. కామారెడ్డి పట్టణంలోని సిరిసిల్ల రోడ్డులో ఉన్న దేశాయ్ బీడీ కంపెనీ గెస్ట్‌హౌస్‌లో కాసేపు భేటీ అయ్యారు. ఈ భేటీలో జిల్లా అభివృద్ధి, రాబోయే రాజకీయ పరిణామాలపై సుదీర్ఘంగా చర్చించారు. సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, కామారెడ్డి జిల్లా రైతాంగానికి వరప్రదాయిని అయిన ప్రాణహిత-చేవెళ్ల సాగునీటి ప్రాజెక్టు పనుల పురోగతిపై మంత్రికి వివరించారు. జిల్లాలో సాగునీటి రంగాన్ని బలోపేతం చేసేందుకు చేపట్టాల్సిన ఇతర అభివృద్ధి పనుల గురించి చర్చించారు. పెండింగ్‌లో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలలో కాంగ్రెస్ విజయకేతనం ఎగురవేసేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మంత్రి సూచించారు.
