అక్షరటుడే, కామారెడ్డి: MLA KVR’s challenge | కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి (MLA Katipally Venkata Ramana Reddy), ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ(Shabbir Ali) మధ్య కొనసాగుతున్న అవినీతి ఆరోపణలు రచ్చకెక్కాయి. గత నాలుగు రోజులుగా కామారెడ్డిలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇరువర్గాలు చర్చకు సిద్ధమని, సమయం, స్థలం చెప్పాలని సవాళ్లు చేసుకున్నాయి.
MLA KVR’s challenge | ప్రభుత్వ డిగ్రీ కళాశాల భూముల విషయంలో..
కామారెడ్డి రాజకీయాలు రసవత్తరంగా మారాయి. తాజాగా కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి మరొక ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు (Kamareddy Government Degree College) చెందిన భూములు అరోరా కళాశాలకు ధారాదత్తం చేశారని, సరస్వతి శిశుమందిర్, అరోరా కాలేజ్ విషయంలో కాంగ్రెస్, నాయకులు చేసిన ఆరోపణలపై తాను చర్చకు సిద్ధమని ఎమ్మెల్యే ప్రకటించారు. ఆధారాలతో సహా శనివారం ఉదయం 10 గంటలకు సరస్వతి శిశుమందిర్ వద్దకు వస్తున్నట్టు ఆయన తెలిపారు.
శిశుమందిర్కు రావాలి..
ఆరోపణలు చేసిన కాంగ్రెస్ నాయకులు శిశుమందిర్ వద్దకు ఆధారాలతో సహా రావాలని కేవీఆర్ సవాల్ చేశారు. తనతో పాటు కళాశాల ఆస్తుల పరిరక్షణ కమిటీ సభ్యులు, శిశుమందిర్ యాజమాన్యం, అరోరా కళాశాల (Aurora College) యాజమాన్యం, కామారెడ్డిలోని అరోరా కళాశాల సూపర్వైజర్ కామారెడ్డి వాసి జంగం నరేష్, కర్షక్ బీఈడీ కళాశాల (Karshak B.Ed College) యాజమాన్యం, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ వస్తారన్నారు. అలాగే డెయిరీ టెక్నాలజీ యూనివర్సిటీ (Dairy Technology University) ప్రిన్సిపాల్, ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్, జీవీఎస్ కాలేజ్ యాజమాన్యం, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్, దేవునిపల్లి ప్రైమరీ హెల్త్ సెంటర్ అధికారి, ఇందిరాగాంధీ స్టేడియం అధికారి కూడా హాజరవుతారన్నారు.
కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ కూడా..
విద్యుత్ సబ్ స్టేషన్ అధికారి, మైనారిటీ హాస్టల్ అధికారి, బాలికల హాస్టల్ అధికారి, గోడౌన్ అధికారి టీవీ టవర్ అధికారి, మున్సిపల్ అధికారులు, కలెక్టర్, రెవెన్యూ అదనపు కలెక్టర్, ఆర్డీవో, తహశీల్దార్ పాల్గొంటారని తెలిపారు. నిజానిజాలు నిర్ధారణ నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ఏం జరగనుంది..?
ఎమ్మెల్యే ప్రకటన నేపథ్యంలో కామారెడ్డి రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఉదయం 10 గంటలకు చర్చకు రావాలని, నిజానిజాలు తెలుస్తానని, ఆధారాలు బయట పెడతానని ఎమ్మెల్యే పేర్కొనడం ఒక్కసారిగా తీవ్ర చర్చకు దారి తీసింది. ఇద్దరు ముఖ్య నాయకులు ఒకరిపై ఒకరు చేసుకున్న ఆరోపణలు, వ్యక్తిగత దూషణలు చర్చకు దారి తీశాయి. హుందాగా వ్యవహరించాల్సిన నాయకుల తీరు కామారెడ్డిలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
అభివృద్ధి పోటీ పడాల్సిన వారు..
అభివృద్ధిపై పోటీగా వెళ్లాల్సిన నాయకులు ఆరోపణలు చేసుకోవడంతో కామారెడ్డిలో అసలేం జరుగుతోందనే చర్చ సాగుతోంది. శనివారం ఆధారాలతో సహా నిజానిజాలు తేలుస్తానని ఎమ్మెల్యే ప్రకటించడంతో ఇరువురు నేతలు చర్చకు నిజంగానే వస్తారా అనే అనుమానాలు నెలకొన్నాయి. ఎమ్మెల్యే ప్రకటన నేపథ్యంలో ఇరు వర్గాలు హోరాహోరీగా శిశుమందిర్ వద్దకు చేరుకునే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. శనివారం కామారెడ్డిలో ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయోనని ప్రజలు చర్చించుకుంటున్నారు.