అక్షరటుడే, ఇందూరు: MLA Dhanpal | కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి మరిచారని, కేవలం కమీషన్ల కోసం ఎగబడుతున్నారని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా (MLA Dhanpal Suryanarayana Gupta) విమర్శించారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనపై అన్ని వర్గాల ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడిందన్నారు. ఎప్పుడూ లేనంత అవినీతి జరుగుతోందని ఆరోపించారు. రైతులకు (Farmers) అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాల్ఓ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం లేదన్నారు. వర్షాల వల్ల జిల్లాలో నష్టం వాటిల్లితే ఒక్క మంత్రి కూడా పరామర్శించలేదని, నష్టపరిహారం కూడా చెల్లించలేదని మండిపడ్డారు. జిల్లాలోని ఆర్వోబీలకు రాష్ట్ర ప్రభుత్వం (state government) నిధులు విడుదల చేయకపోవడంతో పనులు కొనసాగడం లేదన్నారు.
MLA Dhanpal | ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయరా..
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని జోరుగా ప్రచారం చేశారని.. కానీ అర్బన్ నియోజకవర్గంలో (Nizamabad urban constituency) ఇప్పటికీ ఒక్క ఇల్లు ఇవ్వలేదన్నారు. గతంలో తాను మంత్రి పొంగులేటికి వినతిపత్రం అందజేశానని వివరించారు. తక్షణమే 396 ఇళ్లు కేటాయించాలని ఆదేశించినా.. అధికారులు స్పందించలేదన్నారు. అలాగే బస్టాండ్ విషయంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌కు విన్నవించానని చెప్పారు.
ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌ను వైద్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ (Health Minister Damodar Rajanarsimha) పర్యటించినప్పుడు అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేశారన్నారు. మూడు నెలల్లో ఆస్ప్రతి రూపురేఖలు మారాలని నిధులు విడుదల చేస్తామని చెప్పినా ఇప్పటికీ ఏ మార్పు లేదన్నారు. అభివృద్ధి పనులు చేపట్టే వరకు పోరాటం చేస్తామని చెప్పారు.
MLA Dhanpal | సీఎం రేవంత్ రెడ్డి స్పందించాలి
తాను సీఎం రేవంత్ రెడ్డిని (CM Revanth Reddy) కలవడానికి అనేక సార్లు ప్రయత్నించినా.. సమయం ఇవ్వలేదని ధన్పాల్ అన్నారు. అందుకే శుక్రవారం సీఎం నిజామాబాద్ పర్యటనలో ఆయనను కలవాలనే ధృడ నిశ్చయంతో ధర్నాకు దిగామని తెలిపారు. జిల్లా సమస్యలు పూర్తిగా నివేదించామని, కనీసం ఇప్పటికైనా స్పందిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి నాగోల్ల లక్ష్మీనారాయణ, సీనియర్ నాయకుడు న్యాలం రాజు, మాజీ కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు.