Urea
Urea | కుమారుడి రిసెప్షన్​ రద్దు చేసి.. రూ.రెండు కోట్లు యూరియా కోసం ఇచ్చిన ఎమ్మెల్యే

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Urea | ఆ ఎమ్మెల్యే కుమారుడి వివాహాన్ని ఘనంగా జరిపించారు. అంతకంటే ఘనంగా రిసెప్షన్​ చేద్దామని భావించారు. అయితే దానిని రద్దు చేసి ఆ డబ్బులను రైతులకు యూరియా కోసం ఇచ్చారు.

మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (Miryalaguda MLA Lakshma Reddy) తన కుమారుడు సాయి ప్రసన్న రిసెప్షన్ మిర్యాలగూడలో నిర్వహించాలని భావించారు. అయితే దాన్ని రద్దు చేసుకుని ఆ డబ్బును రైతులకు ఉపయోగపడే కార్యక్రమం కోసం వినియోగించాలని నిర్ణయానికి వచ్చారు. ఈ మేరకు గురువారం ఉదయం సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy)ని కలిసి, రూ.2 కోట్ల చెక్కును అందించారు. తన నియోజకవర్గంలోని లక్ష మంది రైతులకు ఆ డబ్బులతో ఒక్కో యూరియా బస్తా (Urea Bag) ఉచితంగా ఇవ్వాలని ఆయన కోరారు. లక్ష్మారెడ్డి కుటుంబ సభ్యులు, నల్గొండ ఎంపీ కుందూరు రఘువీర్ పాల్గొన్నారు. రైతులకు ప్రయోజనం కలిగించే నిర్ణయం తీసుకున్నారని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిని ముఖ్యమంత్రి అభినందించారు.

Urea | గన్​మన్​ దొరికిపోవడంతో..

ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గన్​మన్​ ఇటీవల యూరియాను అక్రమంగా ట్రక్కులో తరలిస్తుండగా పట్టుబడ్డాడు. దీంతో ఎమ్మెల్యేపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఓ వైపు రైతులు యూరియా కొరత (Urea Shortage)తో ఇబ్బందులు పడుతుంటే.. ఎమ్మెల్యే గన్​మన్​ లారీ బస్తాలను తీసుకెళ్లడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు సైతం ఎమ్మెల్యేపై విమర్శలు చేశాయి. బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్ కేటీఆర్​ (KTR) అయితే గన్​మన్​ లారీ యూరియా తీసుకెళ్తే.. ఎమ్మెల్యే గోదాం ఖాళీ చేసి ఉంటారని ఆరోపించారు. కాంగ్రెస్​ నాయకులు బ్లాక్​మార్కెట్​లో యూరియా అమ్ముకుంటున్నారని విపక్షాలు ఇప్పటికే ఆరోపిస్తున్నాయి. ఈ క్రమంలో ఎమ్మెల్యే గన్​మన్​ దొరికి పోవడంతో నష్ట నివారణ చర్యల్లో భాగంగా ఎమ్మెల్యే రూ.రెండు కోట్లు ముఖ్యమంత్రికి అందించినట్లు తెలుస్తోంది.