Mithun Reddy
Mithun Reddy | లిక్కర్ స్కాం దర్యాప్తులో కీలక మలుపు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి సిట్ కస్టడీకి..

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Mithun Reddy | రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన లిక్కర్ స్కాం కేసు(Liquor Scam Case)లో దర్యాప్తు మరింత వేగం పుంజుకుంది. ఈ కేసులో అరెస్ట్ అయి ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని ప్రత్యేక దర్యాప్తు బృందం (S.I.T) కస్టడీకి తీసుకుంది.

విజయవాడ ఏసీబీ కోర్టు(Vijayawada ACB Court) రెండు రోజుల పాటు కస్టడీకి అనుమతించ‌డంతో, ఈ ఉదయం ఆయనను రాజమండ్రి నుంచి విజయవాడకు తరలించారు. గత ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న ఈ భారీ మద్యం కుంభకోణంలో మిథున్ రెడ్డిని నాల్గవ నిందితుడిగా గుర్తించిన S.I.T, అతనిని ఇటీవలే అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కేసులో కీలక సమాచారం తెలుసుకోవాలని, అయిదు రోజుల కస్టడీ అవసరం ఉందంటూ S.I.T అధికారులు(SIT Officers) కోర్టులో పిటిషన్ వేశారు. విచారణ అనంతరం కోర్టు రెండు రోజుల కస్టడీకి అనుమతి మంజూరు చేసింది.

Mithun Reddy | లిక్కర్ స్కామ్ కేసు..

కోర్టు ఆదేశాల మేరకు, సెప్టెంబర్ 19, 20 తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మిథున్ రెడ్డి(Mithun Reddy)ని విచారించనున్నారు. ఇదివరకే ఆయన వేసిన బెయిల్ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే. ఇక ఈ కేసు నేపథ్యంగా దర్యాప్తులోకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) కూడా ప్రవేశించింది. కేసు తీవ్రత దృష్ట్యా చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, న్యూఢిల్లీ తదితర నగరాల్లో ED అధికారులు ఒకేసారి దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పలు కీలక పత్రాలు, ఆస్తుల వివరాలు, నగదు సంబంధిత సమాచారం స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది.

కేసులో మరో కీలక నిందితుడు రాజ్ కసిరెడ్డికి సంబంధించిన ఆస్తులు, నగదు వివరాలపై కూడా ఈడీ అధికారులు SIT బృందంతో సమన్వయం చేసుకుంటున్నట్టు సమాచారం. ప్రాథమికంగా ఈ కుంభకోణంలో సుమారు రూ. 3,500 కోట్ల మేర అక్రమ లావాదేవీలు జరిగినట్టు S.I.T నిర్ధారించింది. తాజా పరిణామాల నేపథ్యంలో, ఈ కేసు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.