అక్షరటుడే, వెబ్‌డెస్క్: Mithun Manhas | భారత క్రికెట్ నియంత్రణ మండలికి (BCCI) కొత్త అధ్యక్షుడిగా దిల్లీ మాజీ కెప్టెన్ మిథున్ మన్హాస్ (Mithun Manhas) నియమితులయ్యారు. ముంబైలో జరిగిన వార్షిక సమావేశంలో అతడిని అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. సుదీర్ఘ కాలంగా ఈ పదవిలో ఉన్న రోజర్ బిన్నీ పదవి నుంచి వైదొలగడంతో, 45 ఏళ్ల మిథున్‌కి అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు.
వరుసగా మూడోసారి మాజీ క్రికెటర్ బీసీసీఐ అధ్యక్ష (BCCI President) పదవిని చేపట్టడం విశేషం. గతంలో సౌరవ్ గంగూలీ, రోజర్ బిన్నీల తర్వాత ఇప్పుడు మిథున్ ఈ స్థానం దక్కించుకున్నారు. కాగా బోర్డు నూతన కార్యవర్గంలో అధ్యక్షుడిగా మిథున్ మన్హాస్ ఎంపిక కాగా.. ఉపాధ్యక్షుడిగా రాజీవ్ శుక్లా (Rajeev Shukla), కార్యదర్శి దేవజిత్ సైకియా, ఖజానాదారు (ట్రెజరర్) రఘురాం భట్, జాయింట్ సెక్రెటరీ ప్రభుతేజ్ సింగ్ భాటియా ఎంపికయ్యారు.
Mithun Manhas | కేంద్ర మంత్రి స్పందన..
మిథున్ మన్హాస్ నియామకాన్ని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ స్వయంగా సోషల్ మీడియా (Social Media) వేదికగా ధృవీకరించారు. “జమ్మూ కశ్మీర్‌కు ఇది గర్వకారణం. నా సొంత జిల్లా దోడా నుంచి మిథున్ అత్యున్నత పదవిని అందుకోవడం గర్వకారణం. ఇదే రోజు కిష్త్వార్‌కు చెందిన శీతల్ అథ్లెటిక్ గోల్డ్ గెలవడం మరింత ఆనందంగా ఉంది,” అని మంత్రి ట్వీట్ చేశారు. అసలు మిథున్ మన్హాస్ ఎవరు? అని చాలా మంది సెర్చ్ చేస్తున్నారు. ఇతను ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో దిల్లీ (Delhi) తరఫున 157 మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 9714 పరుగులు, 27 శతకాలు, 49 అర్ధశతకాలు ఉన్నాయి. ఇతనికి ఐపీఎల్‌లో 55 మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉంది.
కోచ్‌గా డేర్‌డెవిల్స్, పూణె వారియర్స్, చెన్నై సూపర్ కింగ్స్కు సేవలు అందించారు. ప్రస్తుతం జమ్మూ కశ్మీర్ క్రికెట్ అసోసియేషన్‌లో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే ఈసారి బీసీసీఐ అధ్యక్ష పదవి కోసం సచిన్ టెండుల్కర్ (Sachin Tendulkar), హర్భజన్ సింగ్ పేర్లు పరిశీలనలో ఉన్నాయన్న ప్రచారం జరిగింది. సచిన్ బృందం ఇది ఖండించగా, భజ్జీ స్పందించకపోవడంతో ఆయన కూడా రేసులో ఉన్నారన్న ఊహాగానాలు చెలరేగాయి.
కానీ.. చివరికి ఈ పదవి మిథున్ ఖాతాలో పడింది. ఇతర కీలక నియామకాలు చూస్తే.. జాతీయ సెలక్టర్లు: ఆర్పీ సింగ్ (మాజీ పేసర్), ప్రజ్ఞాన్ ఓజా (మాజీ స్పిన్నర్).. ఈ ఇద్దరూ సుబ్రతో బెనర్జీ, ఎస్ శరత్ స్థానాల్లో నియమితులయ్యారు. మహిళల క్రికెట్ సెలక్షన్ కమిటీ చీఫ్ సెలెక్టర్: అమిత్ శర్మ(5 టెస్టులు, 116 వన్డేలు ఆడిన భారత మాజీ క్రికెటర్), సభ్యులు: సులక్షణ నాయక్, స్రవంతి నాయుడు , ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ చైర్మన్: జయేష్ జార్జ్ (కేరళ క్రికెట్ అసోసియేషన్)