అక్షరటుడే, వెబ్డెస్క్ : ACB Trap | అవినీతి అధికారుల్లో ఏ మాత్రం మార్పు రావడం లేదు. నిత్యం ఏసీబీ దాడులు (ACB Raids) చేపడుతున్నా.. కనీసం భయపడటం లేదు. కార్యాలయాకు వివిధ పనుల నిమిత్తం వచ్చే ప్రజలు, కాంట్రాక్టర్లను డబ్బుల కోసం వేధిస్తున్నారు. పైసలు ఇస్తేనే పనులు చేస్తున్నారు. తాజాగా లంచం తీసుకుంటూ మిషన్ భగీరథ (Mission Bhagiratha) డీఈఈ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయింది.
జనగాం (Jangaon) జిల్లాలోని పాలకుర్తి సబ్-డివిజన్, మిషన్ భగీరథ (INTRA), ఉపకార్యనిర్వాహక ఇంజినీరు (DEE) కూనమల్ల సంధ్యారాణిని ఏసీబీ అధికారులు శుక్రవారం అరెస్ట్ చేశారు. ఓ వ్యక్తి భగీరథ పైప్‌లైన్ పనులను పూర్తి చేశారు. సంబంధిత బిల్లుల కోసం కొలతలను ఎంబీ బుక్లో తనిఖీ చేసి సంబంధిత చివరి బిల్లులను కార్యనిర్వాహక ఇంజినీరుకు పంపించడానికి డీఈఈ సంధ్యారాణి రూ.10 వేల లంచం డిమాండ్ చేసింది.
దీంతో బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. శుక్రవారం బాధితుడి నుంచి తన ప్రైవేట్ సహాయకుడు అయిన మహేందర్ ద్వారా యూపీఐ నుంచి లంచం తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అనంతరం కార్యాలయంలో సోదాలు చేపట్టారు. ఆమెపై కేసు నమోదు చేసి, అరెస్ట్ చేశారు.
ACB Trap | లంచం అడిగితే ఫోన్ చేయండి
ప్రజలు అధికారులకు లంచాలు ఇవ్వొద్దని ఏసీబీ అధికారులు (ACB Officers) సూచిస్తున్నారు. ఎవరైనా లంచం అడిగితే భయపడకుండా ఏసీబీకి ఫోన్ చేయాలని చెబుతున్నారు. 1064 టోల్ ఫ్రీ నంబర్ (ACB Toll Free Number), వాట్సాప్ నంబర్ 9440446106కు సమాచారం అందిస్తే అవినీతి అధికారుల పని పడతామని భరోసా ఇస్తున్నారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.
