అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy | ఇంట్లో ఎవరూ కనిపించకపోవడంతో భయపడిన నాలుగేళ్ల చిన్నారి నడుచుకుంటూ బయటకు వెళ్లి కనిపించకుండా పోయింది. కొద్ది సేపటి తర్వాత గమనించిన తల్లిదండ్రులు పలు చోట్ల గాలించినా ఆచూకీ లభించలేదు. దీంతో వారు పోలీసులను ఆశ్రయించగా.. పాపను తల్లిదండ్రుల చెంతకు చేర్చారు.
పట్టణ సీఐ నరహరి (CI Narahari) తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని ఆర్బీ నగర్ (RB Nagar)కు చెందిన కడమంచి జానకి తన నాలుగు సంవత్సరాల కూతురు లాస్యను ఇంటి వద్ద ఉంచి తన భర్త నర్సింలుతో పాటు బయటికి వెళ్ళింది. ఆ సమయంలో పాప ఇంట్లో ఎవరు లేరని భయపడి తల్లిదండ్రుల కోసం వెతుక్కుంటూ ఇంటి నుంచి బయటికి వెళ్లిపోయింది. పాప లేదన్న విషయం గ్రహించిన తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే స్పందించిన సీఐ నరహరి, ఎస్సై నరేష్, సిబ్బంది అశ్విని, భాను పాప ఆచూకీ గాలించారు. ఓ పాల వ్యాపారి ఇచ్చిన సమాచారం ఆధారంగా పాపను కనుగోని వారి తల్లిదండ్రులకు అప్పగించారు. తప్పిపోయిన తమ పాపను అప్పగించిన పోలీసులకు తల్లిదండ్రులు ధన్యవాదాలు తెలిపారు.