అక్షరటుడే, ఆర్మూర్: Sriram Sagar | వర్షాకాలం సీజన్ మొదలై నెల రోజులు దాటిపోయిన శ్రీరాంసాగర్‌కు అంతంత మాత్రంగానే ఇన్‌ఫ్లో వస్తోంది. మహారాష్ట్రతో పాటు నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లో భారీ వర్షాలు (Heavy Rains) లేకపోవడంతో జలాశయంలోకి ఎగువను వరద రావడం లేదు. స్థానికంగా కురిసిన వర్షాలతో స్వల్పంగా ఇన్‌ఫ్లో వస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ప్రస్తుతం ప్రాజెక్టులోకి 608 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోంది. ఆవిరి రూపంలో 277 క్యూసెక్కులు, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1091 అడుగులు (80.5 టీఎంసీలు) కాగా శుక్రవారం ఉదయానికి 1068.5 అడుగుల (20.9టీఎంసీలు) నీరు నిల్వ ఉంది. గతేడాది ఇదే సమయానికి ప్రాజెక్ట్‌లో 14.356 టీఎంసీల నీరు ఉంది.
Sriram Sagar | నిలకడగా నీటిమట్టం
వర్షాలు లేకపోవడంతో ఈ ఏడాది శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లోకి (Sriram Sagar Project) అంతగా వరద రాలేదు. బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లు ఎత్తినప్పటికీ అక్కడ కూడా వర్షాలు లేకపోవడంతో వరద రావడం లేదు. స్థానికంగా కురిసిన వర్షాలకు తోడు ఈ నెల 1 బాబ్లీ ఎత్తిన సందర్భంగా మొదట్లో 6 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చింది. ఆదివారం 3,653 క్యూసెక్యులు, సోమవారం 2,172 క్యూసెక్యులు రాగా మంగళవారం నుంచి 600 క్యూసెక్కులకు తగ్గిపోయింది. దీంతో ప్రాజెక్ట్ నీటిమట్టం నిలకడగా ఉంది. ప్రతి ఏడాది జులై చివర, ఆగస్టులో ఎస్సారెస్పీకి భారీ వరద వస్తుంది.