అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Rajagopal Reddy | మునుగోడు ఎమ్మెల్యే (Munugodu MLA) కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో కాపాడేందుకు ఆస్తులు అమ్మినట్లు ఆయన చెప్పారు. అయితే పార్టీ తనను మోసం చేసిందన్నారు.
మంత్రి పదవి దక్కకపోవడంతో కొంతకాలంగా అసంతృప్తితో ఉన్న ఆయన ఇటీవల పార్టీపై, ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) లక్ష్యంగా ఆయన విమర్శలు చేస్తున్నారు. రాజగోపాల్‌రెడ్డి తీరుతో పార్టీ, ప్రభుత్వం ఇరకాటంలో పడుతున్నాయి. తాజాగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ (BRS) నుంచి వచ్చిన వారికి మంత్రి పదవులు ఇచ్చారన్నారు. తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్‌రావు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. తనతో పాటు బీజేపీ (BJP) నుంచి వచ్చిన వివేక్ వెంకటస్వామికి సైతం మంత్రి పదవి ఇచ్చారని ఆయన అన్నారు. వివేక్ కుమారుడికి ఎంపీ టికెట్ కూడా ఇచ్చారని, తనను మాత్రం పక్కన పెట్టారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
Rajagopal Reddy | కొందరు అడ్డుకుంటున్నారు
పార్టీ కోసం ఆస్తులు అమ్ముకుని కష్టపడిన తనను మోసం చేశారని రాజగోపాల్‌రెడ్డి అన్నారు. తనకు మంత్రి పదవి రాకుండా కొందరు అడ్డుకుంటున్నారని ఆరోపణలు చేశారు. కాగా రాజగోపాల్‌రెడ్డి వరుసగా వ్యాఖ్యలు చేస్తుండటంతో ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. అయినా ఆయనపై అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఇప్పటికే మంత్రుల మధ్య వివాదాలు, కొండా సురేఖ వ్యవహారంతో పార్టీపై వ్యతిరేకత పెరుగుతోంది. ఈ క్రమంలో స్థానిక ఎన్నికల వేళ మరోసారి రాజగోపాల్‌రెడ్డి విమర్శలు చేయడం గమనార్హం.