అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Paddy Bonus | వానాకాలం సీజన్‌కు సంబంధించి ధాన్యం (Paddy) కొనుగోళ్లపై మంత్రులు ఉత్తమ్ కుమార్‌రెడ్డి (Uttam Kumar Reddy), తుమ్మల నాగేశ్వర్ రావు (Tummala Nageswara Rao) జిల్లా కలెక్టర్లతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సన్నాలకు బోనస్‌పై కీలక ప్రకటన చేశారు.
రాష్ట్రంలో సన్నరకం వరి సాగు చేసిన రైతులకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇస్తామని గతంలో కాంగ్రెస్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు గత వానాకాలం సీజన్లో రైతులకు బోనస్ డబ్బులను ప్రభుత్వం జమ చేసింది. మొదట మద్దతు ధర ఖాతాల్లో వేసిన ప్రభుత్వం, అనంతరం బోనస్ చెల్లించింది. అయితే యాసంగి బోనస్ మాత్రం ఇంకా ఇవ్వలేదు. దీంతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించిన రైతులు (Farmers) బోనస్ కోసం నిరీక్షిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా సమీక్షలో మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. మద్దతు ధరతో పాటు బోనస్ చెల్లించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు. వానాకాలం సీజన్‌కు సంబంధించి బోనస్ చెల్లిస్తామన్నారు. అయితే యాసంగి సంగతి ఏంటని రైతులు ఆందోళన చెందుతున్నారు.
Paddy Bonus | రైతులకు సౌకర్యాలు కల్పించాలి
ధాన్యం దిగుబడిలో తెలంగాణలో రికార్డు సృష్టించిదని మంత్రి పేర్కొన్నారు. ఈ సీజన్లో 148.03 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని ఆయన అంచనా వేశారు. ఈ మేరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కేంద్రాల వద్ద రైతులకు వసతులు కల్పించాలన్నారు. ధాన్యం తూకం వేసిన వెంటనే లారీల్లో మిల్లులకు తరలించాలన్నారు. ఈ మేరకు అధికారులు పర్యవేక్షణ చేయాలని సూచించారు. ధాన్యం విక్రయించిన రైతుల ఖాతాల్లో 48 నుంచి 72 గంటల్లో డబ్బులు జమ చేయాలని ఆదేశించారు.
ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందులు తలెత్తితే 1967, 1800–425–00333 నంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు. ఈ సమీక్షలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, వ్యవసాయ కార్యదర్శి సురేంద్ర మోహన్, పౌర సరఫరాల కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.