అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Konda Surekha | మంత్రి కొండా సురేఖ తీరు ఇటు ప్రభుత్వంతో పాటు కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా పరిణమించింది. ప్రతిపక్ష పార్టీ నేతలతోనే కాదు, సహచర మంత్రులతో, సొంత పార్టీ ఎమ్మెల్యేలతో ఆమె పేచీ పెట్టుకోవడం రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది.
తాజాగా మేడారం టెండర్ల వ్యవహారం అధికార పార్టీలో చిచ్చు రేపింది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిపై (Minister Ponguleti Srinivas Reddy) కొండా దంపతులు నేరుగా హైకమాండ్‌కు ఫిర్యాదు చేయడంతో కాంగ్రెస్‌లో కలవరం మొదలైంది. మొదటి నుంచి సురేఖ వ్యవహార శైలి ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది. వరంగల్ జిల్లాలో ఆధిపత్యం కోసం పాకులాడడం, మంత్రిగా మెరుగైన పనితీరు ప్రదర్శించక పోవడం, కేటీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసి కోర్టు మెట్లు ఎక్కడం వంటి ఉదంతాలు సురేఖ ధోరణికి అద్దం పడుతున్నాయి. తాజాగా సహచర మంత్రి పొంగులేటితో వివాదం పెట్టుకోవడంతో కొండా దంపతుల వైఖరిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ జరిగితే ఆమె పదవి పోవడం ఖాయమన్న వార్తలు వినిపిస్తున్నాయి.
Konda Surekha | చిచ్చు రేపిన టెండర్లు..
గిరిజనుల ఆరాధ్య దైవమైన సమ్మక్క సారలమ్మ ఆలయ అభివృద్ధిని ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అభివృద్ధి పనులను ప్రారంభించింది. అయితే, ఈ పనులకు సంబంధించి టెండర్ల వ్యవహారం మంత్రులు పొంగులేటి, కొండా సురేఖ (Konda Surekha) మధ్య వివాదం రేపింది. రూ.71 కోట్ల విలువైన జాతర టెండర్ పనుల కేటాయింపులో పొంగులేటి జోక్యం చేసుకున్నారని, తన సొంత కంపెనీకి టెండర్లు అప్పగించారని కొండా దంపతులు హైకమాండ్‌కు ఫిర్యాదు చేయడం కలకలం రేపింది. అయితే, సీఎం ఆదేశాల మేరకే పనులు ప్రారంభించినట్లు పొంగులేటి వర్గం చెబుతోంది. ఇద్దరు మంత్రుల మధ్య వివాదం చెలరేగడంతో సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) నేరుగా జోక్యం చేసుకుని, కొండా సురేఖపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఏదైనా ఇబ్బంది ఉంటే తన దృష్టికి తీసుకురావాలని, వివాదానికి ఇంతటితో ఫుల్‌స్టాప్ పెట్టాలని ఆయన క్లాస్ పీకినట్లు సమాచారం. దీంతో కొండా దంపతులు వెనక్కి తగ్గారు.
Konda Surekha | వరంగల్ నేతలతో పేచీ..
కొండా దంపతుల వ్యవహారం కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా పరిణమించింది. ప్రధానంగా వరంగల్ జిల్లా రాజకీయాల్లో సురేఖ దంపతుల వైఖరి పార్టీలో చిచ్చు రేపింది. కాంగ్రెస్‌కు చెందిన ఎమ్మెల్యేలంతా ఒకవైపు, కొండా దంపతులు మరోవైపుగా చీలిపోయారు. ఈ నేపథ్యంలో రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరు నెలకొంది. ఒకరిపై మరొకరు తీవ్ర స్థాయిలో ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటుడడం పార్టీలో కలకలం రేపుతోంది. సంయమనంతో వ్యవహరించాలని కొండా సురేఖ, మురళికి (Konda Murali) కాంగ్రెస్ నాయకత్వం పలుమార్లు హెచ్చరికలు కూడా జారీ చేసింది. అయినప్పటికీ వారి వ్యవహారంలో పెద్దగా మార్పు కనిపించడం లేదు.
Konda Surekha | కేటీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై (KTR) మంత్రి కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో పడ్డారు. సినీ నటులు నాగచైతన్య, సమంత విడాకులకు కారణం కేటీఆరేనని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె చేసిన వ్యాఖ్యలు అప్పట్లో రాష్ట్ర రాజకీయ వర్గాలతో పాటు ప్రజల్లో తీవ్ర చర్చకు దారి తీశాయి. దీంతో కేటీఆర్ మంత్రిపై పరువు నష్టం పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఆమె కోర్టు మెట్లెక్కాల్సి వచ్చింది. మంత్రిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు.. ఏం ఆధారాలున్నాయని అలా మాట్లాడారని ప్రశ్నించింది. నోటికి ఏది వస్తే మాట్లాడతారా అని నిలదీసింది. కేటీఆర్‌పై చేసిన వ్యాఖ్యలను సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ నుంచి తొలగించాలని ఆదేశించింది. పరువు నష్టం కేసులో ఓ మంత్రిపై కోర్టు సీరియస్ కావడంతో ఆమెతో పాటు ప్రభుత్వం చిక్కుల్లో పడింది.
Konda Surekha | పదవి పోవడం ఖాయమేనా?
కొండా దంపతుల వైఖరి కాంగ్రెస్ పార్టీని (Congress Party) చిక్కుల్లో పడేస్తోంది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వారి వ్యవహార శైలితో పార్టీతో పాటు ప్రభుత్వం కూడా పలుమార్లు ఇబ్బందుల్లో పడేసింది. ఈ నేపథ్యంలోనే ఆ మధ్య జరిగిన మంత్రివర్గ విస్తరణ సందర్భంగా సురేఖను తప్పిస్తారన్న ప్రచారం జరిగింది. అయితే, బీసీ నేపథ్యంతో పాటు మహిళ కావడంతో హైకమాండ్ వెనక్కి తగ్గింది. అయినప్పటికీ సురేఖ తీరులో మార్పు రాకపోవడం, తరచూ వివాదాలకు కేంద్ర బిందువుగా మారడంతో పార్టీ నాయకత్వం పునరాలోచనలో పడింది. మరోసారి మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ జరిగితే మాత్రం కచ్చితంగా కొండా సురేఖ మంత్రిపదవి పోవడం ఖాయమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అప్పటిలోగా కొండా దంపతుల వ్యవహార శైలి మారకపోతే, పనితీరు మెరుగుపరుచుకోక పోతే మాత్రం వేటు తప్పదని పేర్కొంటున్నాయి.