Jubilee Hills
Jubilee Hills | జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల్లో పోటీపై మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Jubilee Hills | హైదరాబాద్ (Hyderabad)​ మహా నగరంలోని జూబ్లీహిల్స్​ ఉప ఎన్నికపై (By-election) మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar)​ కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన మాజీ ఎంపీ అజారుద్దీన్​తో కలిసి మాట్లాడారు. స్థానికంగా పనిచేస్తున్న నేతకే జూబ్లీహిల్స్‌ టికెట్ ఇస్తామని తెలిపారు. సర్వేలు, అంతర్గత వ్యవహారాలు చూసుకుని హైకమాండ్​ నిర్ణయం తీసుకుంటుందని ప్రకటించారు. ఇతర నియోజకవర్గాల నేతలకు ఇక్కడ ఛాన్స్‌ లేదని స్పష్టం చేశారు.

Jubilee Hills | వారికే అవకాశం

జూబ్లీహిల్స్​ ఉప ఎన్నికల్లో స్థానికంగా పని చేస్తున్న వారికే టికెట్​ వస్తుందని పొన్నం తేల్చి చెప్పారు. జూబ్లీహిల్స్​ ప్రజలతో ఉన్న వారికే టికెట్​ దక్కుతుందన్నారు. అయితే అది ఎవరనేది మాత్రం అధిష్టానం నిర్ణయిస్తుందని తెలిపారు. బయటి నియోజకవర్గాలకు చెందిన టికెట్​ ఆశిస్తున్నా.. ఇక్కడ అవకాశం ఉండదని ఆయన స్పష్టం చేశారు.

Jubilee Hills | కాంగ్రెస్​ను గెలిపించాలి

టికెట్​ ఆశిస్తున్న నేతలు స్థానికంగా ఉండి పార్టీని బలోపేతం చేయాలని పొన్నం సూచించారు. ప్రజలు ఎన్నికల్లో కాంగ్రెస్ (Congress)​ను గెలిపించాలని కోరారు. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా తమ పార్టీ కార్యాచరణతో ముందుకు వెళ్తుందన్నారు. ప్రజల సమస్యలు పరిష్కరించడమే తమ లక్ష్యమన్నారు. గత పదేళ్లుగా పట్టించుకొని సమస్యలను తమ దృష్టికి తీసుకు వస్తే ప్రజా ప్రభుత్వం పరిష్కరిస్తుందని హామీ ఇచ్చారు.

Jubilee Hills | మాగంటి మృతితో..

జూబ్లీహిల్స్​ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్​ (Maganti Gopinath) అనారోగ్యంతో మృతి చెందారు. జూన్​ 8న ఆయన చనిపోయారు. ఈ క్రమంలో ఆరు నెలలోపు ఆ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. దీంతో ఆ స్థానాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలని అధికార కాంగ్రెస్​ పార్టీ యోచిస్తోంది. దీంతో ఇప్పటి నుంచే కార్యాచరణ అమలు చేస్తోంది. చాలా మంది ఆ స్థానం నుంచి పోటీ చేయడానికి ఆసక్తి కనబరుస్తున్న నేపథ్యంలో పొన్నం వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

Jubilee Hills | పోటీకి సై అంటున్న అజారుద్దీన్​

మాజీ ఎంపీ అజారుద్దీన్ (Azharuddin) జూబ్లీహిల్స్​ నుంచి తాను పోటీ చేస్తానని ఇదివరకే ప్రకటించారు. అయితే ఆయన వ్యాఖ్యలపై పీసీసీ అధ్యక్షుడు మహేశ్​కుమార్​ గౌడ్​ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరు పోటీ చేస్తారనేది అధిష్టానం నిర్ణయిస్తుందని చెప్పారు. కాగా అజారుద్దీన్​ అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్​ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. బీఆర్​ఎస్ (BRS)​ అభ్యర్థి మాగంటి గోపినాథ్​కు 80,175 ఓట్లు రాగా.. కాంగ్రెస్​ అభ్యర్థి అజారుద్దీన్​కు 63,838 ఓట్లు వచ్చాయి. ఓడిపోయినా.. తాను నియోజకవర్గంలోనే ఉంటూ పార్టీ బలోపేతానికి కృషి చేశానని అజారుద్దీన్​ పేర్కొంటున్నారు. తనకే టికెట్​ ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. మరి అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపుతుందో చూడాలి.