అక్షరటుడే, వెబ్డెస్క్ : Minister Ponguleti | పట్టణాలలో ఉండే నిరుపేదలకి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivasa Reddy) తీపికబురు అందించారు.
జీవనోపాధికి ఇబ్బంది లేకుండా పేదలు ఉన్న చోటే జీ +3 పద్దతిలో ఇండ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. గిరిజనులకు ప్రత్యేకంగా 22 వేల ఇండ్లు కేటాయించినట్లు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. తొలివిడతలో హైదరాబాద్‌లో (Hyderabad) 16 మురికివాడలను గుర్తించామని, అలాగే వరంగల్, నిజామాబాద్, మహబూబ్‌నగర్, నల్గొండ కరీంనగర్ తదితర పట్టణాలలో కూడా ఇదే విధానాన్ని అమలు చేసేలా కార్యాచరణ రూపొందిస్తున్నట్టు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.
Minister Ponguleti | తీపి కబురు..
ఇందిరమ్మ ఇండ్ల (Indiramma houses) నిర్మాణంపై శుక్రవారం సమీక్షించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. ‘పట్టణాల్లోని మురికి వాడల్లో జీవనం కొనసాగిస్తున్న పేదలు అక్కడే ఉండడానికి ఇష్టపడుతున్నారని, ముఖ్యంగా హైదరాబాద్‌కు (Hyderabad) దూరంగా ఇండ్లు నిర్మించి ఇస్తే తమ జీవనోపాధికి ఇబ్బంది కలుగుతుందన్న ఉద్దేశంతో ఇండ్లు తీసుకోవడానికి ఆసక్తి చూపడం లేదని’ అన్నారు. ‘హైదరాబాద్‌కు దూరంగా గతంలో 42 వేల ఇండ్లను నిర్మించగా సుమారు 19 వేల మంది మాత్రమే అక్కడికి వెళ్లారు. ఇటీవల క్షేత్రస్ధాయిలో మరోసారి పరిశీలన జరుపగా.. కేవలం 13 వేల మంది మాత్రమే ఆ నివాసాలలో ఉంటున్నట్లు’ తేలిందన్నారు. హైదరాబాద్ నగరంలోని (Hyderabad city) మురికి వాడల్లో పేదలు ఉన్నచోటే జి+3 పద్దతిలో ఇందిరమ్మ ఇండ్లను నిర్మించాలని నిర్ణయించినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Minister Ponguleti Srinivas Reddy) వెల్లడించారు.
ఏండ్ల తరబడి నిలువ నీడలేక తలదాచుకోవడానికి గూడులేని చెంచులకు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth reddy) సూచన మేరకు భద్రాచలం, ఉట్నూరు, ఏటూరునాగారం, మున్ననూరు నాలుగు ఐటీడీఏ పరిధిలోగల చెంచు, కొలం, తోటి, కొండరెడ్లకు 13,266 ఇందిరమ్మ ఇండ్లను (Indiramma houses) మంజూరు చేశామని చెప్పారు. అలాగే రాష్ట్రంలోని 16 ఎస్టీ నియోజకవర్గాలకు ఇప్పటికే 8,750 ఇండ్లు మంజూరు చేశామని, దీనితో కలిపి గిరిజనులకు ఇంతవరకు 22,016 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసినట్లు గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా పేదవాళ్ల ఇంటికోసం ఐదు లక్షల రూపాయలు ఖర్చు చేయడం లేదని.. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వడమే తమ ప్రభుత్వ లక్ష్యం అంటూ ఆయన పేర్కొన్నారు.