అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Hayathnagar | హయత్ నగర్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (Minister Komatireddy Venkat Reddy) ఓకే చెప్పారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
హయత్‌నగర్‌లో (Hayathnagar) ఇటీవల అనేక రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. రోడ్డు దాటుతున్న వారిని వేగంగా వచ్చి వాహనాలు ఢీకొనడంతో అనేక మంది చనిపోయారు. దీనిపై మంగళవారం స్థానికులు ఆందోళన చేపట్టారు. హైదరాబాద్–విజయవాడ హైవేపై (Hyderabad-Vijayawada highway) ధర్నా చేశారు. దీంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇక్కడ నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది జాతీయ రహదారా.. మృత్యు మార్గమా అని ప్రశ్నించారు. ఇటీవల రోడ్డు దాటుతుండగా ఎంబీబీఎస్ విద్యార్థిని ఐశ్వర్య మరణించిన విషయం తెలిసిందే. దీంతో హైవేకు ఇరువైపులా ఉన్న కాలనీలవాసులు ఆందోళన నిర్వహించారు. ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మించాలని డిమాండ్ చేశారు.
Hayathnagar | భారీగా ట్రాఫిక్ జామ్
హైవేపై ఆందోళనతో భారీగా ట్రాఫిక్ జామ్ (traffic jam) అయింది. దీంతో పోలీసులు వచ్చి నిరసనకారులతో మాట్లాడారు. వారిని సముదాయించారు. అనంతరం ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. ఈ విషయం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దృష్టికి వెళ్లడంతో ఆయన స్పందించారు. హయత్‌నగర్‌లోని లెక్చరర్స్ కాలనీ వద్ద ఫుట్ఓవర్ బ్రిడ్జి నిర్మిస్తామని తెలిపారు. మూడు నెలల్లో వంతెన నిర్మాణం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. దీంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.