అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Minister Komatireddy | మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఓ టీవీ ఛానెల్లో మహిళా ఐఏఎస్‌పై వచ్చిన వార్తలను ఆయన ఖండించారు.
నల్గొండ జిల్లా (Nalgonda District)లోని ఓ మహిళా అధికారితో మంత్రి ప్రేమాయణం అంటూ ఇటీవల ఓ ఛానెల్ కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై మంత్రి కోమటిరెడ్డి తాజాగా స్పందించారు. మహిళా అధికారులపై రాస్తున్న వార్తల్ని ఆయన ఖండించారు. తనపై ఏమైనా రాయండి తట్టుకుంటా కానీ మహిళా అధికారులపై ఇష్టమొచ్చినట్లు వార్తలు రాయొద్దని కోరారు.
Minister Komatireddy | కుమారుడిని కోల్పోయా..
తనకు ఉన్న ఒక్కగానొక కుమారుడిని కోల్పోయి ఫౌండేషన్ పేరుతో ప్రజాసేవ చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. అప్పుడే రాజకీయాలు వదిలేస్తే బాగుండేదన్నారు. తప్పుడు రాతల వల్ల ఇప్పుడు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వార్తలపై ప్రభుత్వం తరఫున సమగ్ర దర్యాప్తు జరపాలని సీఎంను కోరారు.
Minister Komatireddy | సీఎంకే అధికారం ఉంటుంది
తాను మంత్రి అయ్యాక నల్గొండలో నలుగురు కలెక్టర్లు (Collectors) మారారని కోమటిరెడ్డి స్పష్టం చేశారు. కలెక్టర్లను మార్చే అధికారం సీఎం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఉంటుందన్నారు. అసభ్యకర వార్తలు వస్తే ఇంట్లో వాళ్లు ఇబ్బందులు పడతారని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి వార్తలు రాసే వారికి కుటుంబాలు ఉంటాయన్నారు. సదరు ఐఏఎస్ అధికారి స్థానంలో ఉండి ఆలోచన చేయాలని మీడియాకు సూచించారు. ఇలాంటి వార్తలతో సదరు అధికారుల కుటుంబాలు ఇబ్బందులు పడుతాయన్నారు.
Minister Komatireddy | టికెట్ రేట్ల పెంపుతో సంబంధం లేదు
తాను సినీ ఇండస్ట్రీ గురించి పట్టించుకోవడం లేదని మంత్రి కోమటిరెడ్డి స్పష్టం చేశారు. సినిమాటోగ్రఫి మంత్రి సినీ పరిశ్రమ (Film Industry) గురించి పట్టించుకోవడం లేదని అనడం రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. ఆయన మాట్లాడుతూ.. పుష్ప-2 సినిమా తర్వాత టికెట్ రేట్లు పెంచాలని తన వద్దకు రావొద్దని చెప్పానన్నారు. దీంతో తనను ఎవ్వరూ కలవడం లేదని స్పష్టం చేశారు. రాజాసాబ్, మన శంకర వరప్రసాద్ గారు సినిమా టికెట్ రేట్ల (Movie Ticket Prices) పెంపునకు తనకు సంబంధం లేదన్నారు. దీంతో మంత్రికి తెలియకుండా టికెట్ రేట్లు ఎలా పెంచుతారని రాజకీయ వర్గాల్లో చర్చించుకుంటున్నారు.