హైదరాబాద్: ఐటీ హబ్ మాధాపూర్‌లో ఆదివారం ఉదయం పరుగు ఉత్సాహం ఉప్పొంగింది. మైండ్‌స్పేస్ REIT, మిర్చి సంయుక్తంగా నిర్వహించిన మైండ్‌స్పేస్ ఈకో రన్ 2.0 ఘనంగా ముగిసింది. పర్యావరణ బాధ్యతను, ఫిట్‌నెస్‌ను మేళవించిన ఈ రన్‌లో సుమారు 4,200 మందికి పైగా రన్నర్లు పాల్గొని ఈవెంట్‌ను విజయవంతం చేశారు.
ఈ ఈవెంట్ వరుసగా రెండో ఏడాది కూడా నగరవాసులను విశేషంగా ఆకట్టుకుంది. ఇందులో 5 కిలోమీటర్లు, 10 కిలోమీటర్లు మరియు 21 కిలోమీటర్ల (హాఫ్ మారథాన్) విభాగాలు ఉండటంతో అన్ని వయసుల వారు ఆసక్తి చూపారు. 8 ఏళ్ల పిల్లల నుంచి వృద్ధుల వరకు, కార్పొరేట్ ఉద్యోగుల నుంచి ప్రొఫెషనల్ రన్నర్ల వరకు ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. సెలబ్రిటీలు దివి వాధ్య, హర్ష్ రోషన్, మరియు శ్రీదేవి అప్పళ్ల ఈ పరుగును జెండా ఊపి ప్రారంభించారు. మిర్చి ఆర్జేల సందడి రన్నర్లలో మరింత ఎనర్జీని నింపింది.
వ్యర్థాలు కుర్చీలుగా..
ఈ రన్ యొక్క అతిముఖ్యమైన అంశం పర్యావరణ హితం. రన్నర్లకు అందించిన రేస్ కిట్స్‌లో ప్లాంట్ చేయగలిగే బిబ్స్ (నాటగలిగేవి), ఆర్గానిక్ జెర్సీలు వాడారు. ప్లాస్టిక్ వాడకాన్ని నియంత్రించేందుకు రీఫిల్లబుల్ వాటర్ స్టేషన్లు, బయోడిగ్రేడబుల్ కట్లరీని ఉపయోగించి పర్యావరణం పట్ల తమ బాధ్యతను చాటుకున్నారు. కేవలం పరుగుతోనే ఆగకుండా, ఈ ఈవెంట్‌లో సేకరించిన వ్యర్థాలను అప్‌సైకిల్ చేసి కుర్చీలుగా తయారు చేయడం విశేషం. ఈ కుర్చీలను ఎన్జీఓ భాగస్వామి నిర్మాణ్ ద్వారా పేద విద్యార్థులకు అందజేయనున్నారు.
కే రహేజా కార్ప్ సీఓఓ శ్రావణ్ కుమార్ గోనే మాట్లాడుతూ, ఈకో రన్ అనేది కేవలం ఒక క్రీడ కాదని, సస్టైనబిలిటీని తమ అభివృద్ధిలో భాగం చేయాలన్న నిబద్ధతకు ఇది నిదర్శనమని తెలిపారు. సమాజంపై సానుకూల ప్రభావం చూపడమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఈ ఈవెంట్‌కు ముందు నిర్వహించిన సస్టైనబిలిటీ ఫ్లీ మార్కెట్ ద్వారా ఆర్థికంగా వెనుకబడిన మహిళలకు ఉపాధి అవకాశాలు కూడా కల్పించారు. మొత్తం మీద మైండ్‌స్పేస్ ఈకో రన్ 2.0 హైదరాబాద్‌లో మైండ్‌ఫుల్ లివింగ్ మరియు సామాజిక బాధ్యత వైపు ఒక బలమైన అడుగు వేసింది.
