అక్షరటుడే, వెబ్‌డెస్క్: Asaduddin Owaisi | విపక్షాలు నిలబెట్టిన ఉప రాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్‌రెడ్డికి (Justice Sudarshan Reddy) ఎంఐఎం మద్దతు ప్రకటించింది. తొలి నుంచి ఎన్డీయేను వ్యతిరేకిస్తున్న మజ్లిస్ ఇండి కూటమివైపు నిలబడింది. ఈ నేపథ్యంలో భారత కూటమి ఉపరాష్ట్రపతి ఎన్నికల నామినీ బి. సుదర్శన్ రెడ్డికి హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ (MP and MIM chief Asaduddin Owaisi) మద్దతు తెలిపారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) అభ్యర్థన మేరకు ఇండి కూటమి అభ్యర్థికి మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. “వైస్ ప్రెసిడెంట్ గా జస్టిస్ సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఫోన్ వచ్చింది. తోటి హైదరాబాదీ, గౌరవనీయ న్యాయనిపుణుడు జస్టిస్ రెడ్డికి ఎంఐఎం పూర్తి మద్దతు తెలుపుతుంది. నేను జస్టిస్ సుదర్శన్‌రెడ్డితో కూడా మాట్లాడి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశాను” అని ఒవైసీ Xలో పోస్టు చేశారు.
Asaduddin Owaisi | 9న ఉప రాష్ట్రపతి ఎన్నిక
జగదీప్ ధన్‌ఖడ్ (Jagdeep Dhankhar) అనూహ్యంగా రాజీనామా చేయడంతో ఉప రాష్ట్రపతి ఎన్నిక అనివార్యమైంది. సెప్టెంబర్ 9న నిర్వహించనున్న ఈ ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థిగా ప్రస్తుత మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ బరిలోకి దిగారు. ఆయనకు ప్రత్యర్థిగా రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్‌రెడ్డిని విపక్ష కూటమి పోటీకి పెట్టింది. ఆంధ్రప్రదేశ్‌లో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసి, గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన రెడ్డి, జనవరి 2007లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
ఆయన జూలై 2011లో పదవీ విరమణ చేశారు. తెలంగాణ బిడ్డ అయిన ఆయన న్యాయ నిపుణుడిగా మంచి పేరుంది. తెలంగాణ ఉద్యమానికి మద్దతు ప్రకటించిన ఆయన మచ్చ లేని జడ్జిగా పేరొందారు. దీంతో ఆయనను విపక్ష కూటమి పోటీలో నిలిపింది. ఈ నెల 9న నిర్వహించనున్న ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. పార్లమెంటులో స్పష్టమైన సంఖ్యాబలం ఉన్న ఎన్డీయే అభ్యర్థి విజయం సాధించడం లాంఛనమే కానుంది.