అక్షరటుడే, వెబ్‌డెస్క్: Helmet : మధ్యప్రదేశ్(Madhya Pradesh)లోని ఇండౌర్(Indore)లో తాజాగా కఠినమైన ట్రాఫిక్ ఆంక్షలు అమలులోకి తీసుకొచ్చారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలనే నిబంధనను కఠినంగా అమలు చేస్తున్నారు. ఇంధన బంకుల్లోనూ ఆంక్షలు విధించారు. ‘నో హెల్మెట్.. నో పెట్రోల్’ ‘No helmet.. no petrol’ నిబంధన తీసుకొచ్చారు. అంటే ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్ లేకుండా బంకులోకి వస్తే.. పెట్రోల్ ఇవ్వొద్దనే ఆంక్షలు అమలు చేస్తున్నారు.
ఆగస్టు ఒకటి నుంచి బైకర్లు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలనే నిబంధనను పటిష్ఠంగా అమలు చేస్తున్నారు. కాగా, ఓ ద్విచక్ర వాహనదారుడు ఈ నిబంధనను ఉల్లంఘించాడు. ఓ ఇంధన బంకులోకి వాహనంతో వెళ్లాడు. అయితే అతగాడు హెల్మెట్ ధరించలేదు.
బైకర్లు నిర్లక్ష్యం వహించినా.. ఇంధన బంకు యజమానులు మాత్రం కఠినంగా వ్యవహరించాల్సి ఉంది. కానీ, ఇక్కడ ఇంధన బంకు సిబ్బంది కూడా లైట్‌గా తీసుకున్నారు. ప్రభుత్వం విధించిన నిబంధనను తుంగలో తొక్కారు. దీంతో అధికారులు ఈ వ్యవహారంపై సీరియస్ అయ్యారు. ఏకంగా ఆ బంకునే సీజ్ చేశారు.
Helmet : నిర్లక్ష్యంగా వ్యవహరించి..
ఇంతకీ ద్విచక్ర వాహనదారుడు(పాల విక్రేత) ఏం చేశాడంటే.. హెల్మెట్ ధరించకుండా పెట్రోల్ కోసం వచ్చాడు. బంకులోకి వచ్చాక.. తలపై పాల క్యాన్ మూతను పెట్టుకుని పెట్రోల్ కోసం లైన్లో నిలబడ్డాడు. అయితే, బంకు సిబ్బంది అతగాడిని పట్టించుకోకుండా, సర్కారు నిబంధనను తుంగలో తొక్కి నిర్లక్ష్యంగా.. ఆ బైకరుకు పెట్రోల్ పోశారు.
ఈ వ్యవహారం కాస్త ఎవరో చిత్రీకరించి నెట్టింట పోస్ట్ చేయడంతో.. అదికాస్త వైరల్‌గా మారింది. దీంతో అధికారులు స్పందించి దర్యాప్తు చేపట్టారు. నిబంధనలు అతిక్రమించి పెట్రోల్ పోసిన బంకరుపై అధికారులు సీరియస్ అయ్యారు. సదరు బంకు(fuel station)ను అధికారులు సీజ్ చేశారు.
నో హెల్మెట్.. నో పెట్రోల్ నిబంధనను తప్పనిసరిగా అమలు చేయాలని అధికారులు స్పష్టం చేశారు. ఎవరైనా అతిక్రమిస్తే.. ఏడాది కాలం జైలు శిక్ష, లేదా రూ. ఐదు వేల జరిమానా.. లేదంటే రెండింటిని విధించే అవకాశం ఉందని హెచ్చరించారు.