అక్షరటుడే, వెబ్‌డెస్క్: Migraine : మైగ్రేన్.. పార్శ్వపు తల నొప్పి. ఇది వస్తే భరించడం చాలా కష్టమే. అయితే చిన్న చిట్కాలతో దీన్ని దూరం చేసుకోవడం చాలా సులభం. మైగ్రేన్‌ను కారణాలను కనిపెట్టి ముందస్తు మందులతో దీనికి అడ్డుకట్ట వేయడం సులభమేనని వైద్యులు అంటున్నారు. పార్శ్య నొప్పికి వయసుతో పని లేదు. పిల్లల్లో, పెద్దల్లో, వృద్ధుల్లో ఎవరినైనా ఇది వేధించవచ్చు. అయితే ముఖ్యంగా 20 నుంచి 40 ఏళ్ల వయస్కుల్లో దీని ప్రభావం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సాధారణ తల నొప్పికి, పార్శ్వపు నొప్పికి స్పష్టమైన తేడాలుంటాయి. సాధారణ తలనొప్పులు కొన్ని నిమిషాల పాటు ఇబ్బంది పెడితే, మైగ్రేన్ రోజుల తరబడి వేధిస్తుంది. ఈ నేపథ్యంలో అసలు పార్శ్వపు తలనొప్పి(migraine headaches) లక్షణాలు, నివారణ ఎలాగో ఇది చదివేయండి.
Migraine : లక్షణాలు..
మైగ్రేన్‌ను గుర్తించడం చాలా సులువు. కంటి వెనక నొప్పి మొదలవుతుంది. తలకు ఎడమ వైపు, కుడి వైపు ఇలా తలలో ఒక వైపు నొప్పి వస్తుంది. వేర్వేరు వ్యక్తుల్లో వేర్వేరుగా నొప్పి వస్తుంది. తల మీద కొట్టినట్టు, తల పగిలిపోతున్నట్టు భరించలేనంత నొప్పి ఉంటుంది. కళ్లు బైర్లు కమ్మడం(Eyestrain), నీరసం(drowsiness), చీకాకు(dizziness) వంటివి వెంటాడుతాయి. శబ్దాలు, వెలుతురునూ భరించలేని స్థితి తలెత్తుతుంది. ఇవన్నీ మైగ్రేన్ లక్షణాలు. ఈ నొప్పికి కొన్ని అంశాలు దోహదపడుతూ ఉంటాయి. నిద్ర లేమి, అధిక శబ్దం, సినిమాకు, పబ్‌లకూ వెళ్లి రావడం, విపరీతమైన ఒత్తిడికి లోనవడం, మద్యం/మాదక ద్రవ్యాలు తీసుకోవడం వంటి వాటి వల్ల మైగ్రేన్ వస్తుంది. ఈ నొప్పి ప్రారంభంలో నెలలో ఒకసారికి పరిమితమైతే, క్రమేపీ నెలలో ఐదారుసార్లకు పెరిగిపోతుంది. దీనివల్ల ఎలాంటి పని చేయాలనిపించదు. పూర్తిగా బెడ్‌కే పరిమితం కావాల్సి వస్తుంది. కాబట్టి మైగ్రేన్ నొప్పిని వీలైనంత త్వరగా నిర్థారించుకుని, వెంటనే చికిత్స తీసుకోవాలి.
Migraine : నివారణ మీ చేతుల్లోనే..
మైగ్రేన్‌ను నియంత్రించడం మీ చేతుల్లోనే ఉంది. సరిపడా నిద్రపోవాలి. అది కూడా సరైన నిద్రవేళలు పాటించాలి. నిర్దేశిత సమయానికే ఆహారం తీసుకోవాలి. ఒత్తిడికి సాధ్యమైనంత దూరంగా ఉండాలి. డీజే(DJ)లు, ఇతర భారీ శబ్ధాల(loud noises)కు దూరంగా ఉండాలి. వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలి. నొప్పిని ప్రేరేపించే పదార్థాలను మానేయాలి. మద్యపానం, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి.
Migraine : వైద్యులను సంప్రదించాలి..
అయినప్పటికీ మైగ్రేన్ తగ్గకపోతే డాక్టర్లను సంప్రదించాలి. సమస్యను త్వరగా నిర్థారించుకోవడంతో పాటు నివారణ చర్యలు, చికిత్సలను ఎంత త్వరగా అనుసరించగలిగితే ఈ సమస్య అంత మెరుగ్గా అదుపులో ఉంటుంది. వైద్యులు సూచించిన మాత్రలను వాడితే నొప్పి తీవ్రమవకుండా ఉంటుంది. అలాగే వేర్వేరు ఆరోగ్య సమస్యలున్న వారికి వైద్యులు సూచించే మైగ్రేన్ మాత్రలు కూడా వేర్వేరుగా ఉంటాయి.
అన్ని మాత్రల్లాగే వీటికి కూడా జుట్టు రాలిపోవడం(hair loss), బరువు పెరగడం(weight gain), నెలసరి సమస్యలు(menstrual problems) లాంటి దుష్ప్రభావాలు కూడా ఉంటాయి. అయితే ఈ తలనొప్పి శాశ్వత సమస్య కాదు. వైద్యుల సూచనల మేరకు క్రమం తప్పకుండా మందులు వాడితే నొప్పి మాయమవుతుందని వైద్యులు చెబుతున్నారు.