అక్షరటుడే, వెబ్‌డెస్క్: RCB vs MI | మహిళల ప్రీమియర్ లీగ్–2026లో భాగంగా సోమవారం రాత్రి వడోదర వేదికగా జరిగిన కీలక మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ మహిళల జట్టు అద్భుత విజయం సాధించింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) మహిళల జట్టుతో జరిగిన ఈ పోరులో ముంబై ఇండియన్స్ 15 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో హర్మన్‌ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur) నేతృత్వంలోని ముంబై జట్టు ప్లే ఆఫ్స్ రేస్‌లో తన ఆశలను సజీవంగా ఉంచుకోగా, ఆర్సీబీ జట్టు మరోసారి నిరాశను ఎదుర్కొంది. ఈ టోర్నీలో ఆర్సీబీకి ఇది వరుస పరాజయంగా నిలిచింది.
RCB vs MI | సేఫ్ జోన్లో ముంబై ఇండియన్స్..
టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ (Mumbai Indians) తొలుత బ్యాటింగ్ చేయగా, నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి 199 పరుగులు చేసింది. ఈ ఇన్నింగ్స్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచింది స్టార్ ఆల్‌రౌండర్ నాట్ స్కివర్ బ్రంట్. అద్భుతమైన బ్యాటింగ్‌తో ఆమె కేవలం 57 బంతుల్లోనే శతకం పూర్తి చేసి అజేయంగా నిలిచింది. 16 ఫోర్లు, ఒక సిక్సుతో 100 పరుగులు చేసిన నాట్ స్కివర్ బ్రంట్ డబ్ల్యూపీఎల్ చరిత్రలో సెంచరీ చేసిన ఆటగాళ్లలో ఒకరిగా రికార్డు సృష్టించింది. ఆమెతో పాటు హేలీ మాథ్యూస్ (Hayley Matthews) కూడా చక్కటి సహకారం అందిస్తూ 56 పరుగులు చేసి ముంబై ఇన్నింగ్స్‌కు బలమైన పునాది వేసింది. ఈ ఇద్దరి ధాటికి ఆర్సీబీ బౌలర్లు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు.
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు పోరాడినా, చివరకు లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. నిర్ణీత ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 184 పరుగులకే పరిమితమైంది. ఆర్సీబీ తరఫున రిచా ఘోష్ అద్భుతంగా రాణించింది. క్రీజులో ఉన్నంత సేపు ముంబై బౌలర్లపై ఎదురుదాడి చేసిన ఆమె 50 బంతుల్లో 10 ఫోర్లు, ఆరు సిక్సర్లతో 90 పరుగులు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే రిచా ఘోష్‌కు మిగతా బ్యాటర్ల నుంచి సరైన సహకారం లభించలేదు. కీలక సమయంలో వరుస వికెట్లు కోల్పోవడం ఆర్సీబీ పరాజయానికి ప్రధాన కారణంగా మారింది.
బౌలింగ్ విభాగంలో ఆర్సీబీ తరఫున లారెన్ బెల్ రెండు వికెట్లు పడగొట్టగా, శ్రేయాంకా పాటిల్, ఎన్డీ క్లార్క్ తలా ఒక వికెట్ తీశారు. ముంబై ఇండియన్స్ బౌలర్లలో హేలీ మాథ్యూస్ మూడు వికెట్లతో చెలరేగగా, ఇస్మాయిల్, అమీలియా కేర్ తలా రెండు వికెట్లు తీసి ప్రత్యర్థిని కట్టడి చేశారు. కీలక సమయాల్లో ముంబై బౌలర్లు చూపిన కట్టుదిట్టమైన ప్రదర్శనే జట్టుకు విజయాన్ని అందించింది.మొత్తంగా ఈ మ్యాచ్ ముంబై ఇండియన్స్‌కు టోర్నీలో కొత్త ఊపును ఇచ్చింది.