అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Musi River | మూసీ నది వరదల నుండి మహాత్మా గాంధీ బస్‌స్టేషన్ (ఎంజీబీఎస్ MGBS) ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది. జంట జలాశయాల నుంచి వచ్చిన వరదలు బస్టాండ్‌ను జలదిగ్బంధంలోకి నెట్టాయి. దీంతో బస్సుల రాకపోకలు ఆగాయి.
అయితే వరద నీరు (Flood Water) నెమ్మదిగా తగ్గడంతో బస్టాండ్‌లో నిలిచిన నీరు ఖాళీ అయింది కాని, బురద మాత్రం చాలా పేరుకుపోయింది. అధికారులు, సిబ్బంది శ్రమతో ప్రస్తుతం బస్టాండ్‌ను శుభ్రం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎంజీబీఎస్‌లోని ప్లాట్‌ఫారమ్ 56, 58, 60 వద్ద భారీగా బురద పేరుకుపోవడం గమనార్హం. అలాగే బస్టాండ్ మార్గంలోని శివాజీ బ్రిడ్జ్‌పైన కూడా బురద పేరుకుపోవడంతో ట్రాఫిక్‌కు (Traffic) అంతరాయం కలిగింది.
Musi River | శరవేగంగా పనులు..
సంబంధిత సిబ్బంది బురదను తొలగించే పనిలో నిమగ్నమయ్యారు. ఇవాళ మధ్యాహ్నం తర్వాత బస్టాండ్‌ను తిరిగి ప్రారంభించే అవకాశం ఉన్నట్టు అధికారులు తెలిపారు. తాత్కాలికంగా బస్సుల రూట్లలో (Bus Roots) మార్పులు గమనిస్తే.. అదిలాబాద్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్ (Nizamabad) వైపు బస్సులు → జేబీఎస్ నుంచి, వరంగల్ (Warangal), హన్మకొండ వైపు బస్సులు → ఉప్పల్ క్రాస్‌రోడ్ నుంచి, సూర్యాపేట, నల్లగొండ, విజయవాడ (Vijayawada) వైపు బస్సులు → ఎల్బీనగర్ నుంచి, మహబూబ్‌నగర్, కర్నూలు, బెంగళూరు వైపు బస్సులు → ఆరంఘర్ నుంచి వెళుతున్నాయి.
అయితే పండుగ పూట ప్రయాణికులకు ఇది చేదు అనుభవం అని చెప్పాలి. శుక్రవారం అర్ధరాత్రి నుంచి ఎంజీబీఎస్‌లోకి భారీగా వరద నీరు ప్రవేశించడంతో, బస్సులు ఎక్కడివి అక్కడే నిలిచిపోయాయి. రాకపోకలు పూర్తిగా స్థంభించడంతో, పండుగ సందర్భంగా ఊరికి బయలుదేరిన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
కొన్ని ప్రాంతాల్లో తాడ్ల సాయంతో వారిని వెలుపలికి తరలించాల్సిన పరిస్థితి ఏర్పడింది.ఆర్టీసీ అధికారుల సమాచారం మేరకు, గత 30 ఏళ్లలో ఇంతటి భారీ వరద ఎంజీబీఎస్‌కు రావడం ఇదే మొదటిసారి. ఆందోళనకు గురైన ప్రయాణికులకు (Passengers) సహాయంగా, బస్సులను ఇతర ప్రాంతాల నుంచి నడిపించడం ప్రారంభించినట్టు అధికారులు తెలిపారు. పండుగ సమయంలో ప్రయాణాల ఒత్తిడిని దృష్టిలో పెట్టుకుని, త్వరితగతిన రవాణా వ్యవస్థను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.