అక్షరటుడే, వెబ్‌డెస్క్: mexico private plane crash | మెక్సికోలో Mexico ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. మిడిల్ మెక్సికోలో అత్యవసర ల్యాండింగ్‌కు ప్రయత్నించిన ఓ చిన్న ప్రైవేట్ విమానం కుప్పకూలి ఏడుగురు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. ఈ విషయాన్ని మెక్సికో స్టేట్ సివిల్ ప్రొటెక్షన్ కోఆర్డినేటర్ అడ్రియాన్ హెర్నాండెజ్ ధృవీకరించారు. ఈ ప్రమాదం మెక్సికో సిటీకి పశ్చిమాన సుమారు 31 మైళ్ల దూరంలో ఉన్న టోలుకా విమానాశ్రయానికి మూడు మైళ్ల పరిధిలోని పారిశ్రామిక ప్రాంతం సాన్ మాటియో అతెంకోలో చోటుచేసుకుంది. విమానం ఒక్కసారిగా కుప్పకూలడంతో భారీగా మంటలు చెలరేగి పరిసర ప్రాంతాల్లో భయాందోళనలు నెలకొన్నాయి.
mexico private plane crash | ల్యాండింగ్ సమయంలో..
అధికారుల సమాచారం ప్రకారం, పసిఫిక్ తీరంలోని అకపుల్కో నుంచి ఈ ప్రైవేట్ జెట్ Private Jet బయలుదేరింది. సాంకేతిక సమస్యల కారణంగా అత్యవసర ల్యాండింగ్‌కు ప్రయత్నించగా, ఫుట్‌బాల్ మైదానంలో దిగే క్రమంలో ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. అయితే ల్యాండింగ్ సమయంలో విమానం సమీపంలోని ఓ వ్యాపార భవనం పైకప్పును ఢీకొట్టడంతో అదుపు తప్పి కుప్పకూలింది. ప్రమాద సమయంలో విమానంలో ఎనిమిది మంది ప్రయాణికులు, ఇద్దరు సిబ్బంది ఉన్నట్లు హెర్నాండెజ్ తెలిపారు. ప్రమాదం జరిగిన కొన్ని గంటల తర్వాత వరకు ఏడుగురు మృతదేహాలను వెలికితీశామని, మిగతా వారి పరిస్థితిపై స్పష్టత రావాల్సి ఉందన్నారు. మంటల తీవ్రత కారణంగా సహాయక చర్యలకు కొంత ఆటంకం ఏర్పడినట్లు అధికారులు తెలిపారు.
ఈ ఘటనపై సాన్ మాటియో అతెంకో మేయర్ అనా మునీస్ మిలెనియో స్పందించారు. విమానం Aeroplane కూలిన వెంటనే చెలరేగిన మంటల నేపథ్యంలో భద్రతా చర్యలలో భాగంగా పరిసర ప్రాంతాల్లోని సుమారు 130 మందిని ఖాళీ చేయించామని తెలిపారు. అగ్నిమాపక దళాలు వెంటనే స్పందించి మంటలను అదుపులోకి తీసుకొచ్చినట్లు చెప్పారు. విమాన ప్రమాదానికి గల కారణాలపై ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించింది. సాంకేతిక లోపమా, వాతావరణ పరిస్థితులా లేదా మానవ తప్పిదమా అనే కోణాల్లో విచారణ జరుపుతున్నట్లు అధికారులు తెలిపారు. పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని సంబంధిత శాఖలను ఆదేశించినట్లు వెల్లడించారు.