అక్షరటుడే, వెబ్‌డెస్క్: Mexico Plane Crash | మెక్సికో నేవీకి చెందిన ఓ విమానం ప్రమాదానికి గురై ఐదుగురు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు ధృవీకరించారు. టెక్సాస్‌లోని గాల్వేస్టోన్ కాజ్వే (Galveston Causeway) సమీపంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. వైద్య కార్యకలాపాల కోసం వెళ్తున్న సమయంలోనే విమానం కుప్పకూలినట్లు సమాచారం.
మెక్సికో నౌకాదళం అధికారులు (Mexican Naval Officers) తెలిపిన వివరాల ప్రకారం.. ఒక ఏడాది వయసున్న చిన్నారిని అత్యవసర వైద్య చికిత్స కోసం తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆ విమానంలో చిన్నారితో పాటు నలుగురు నేవీ అధికారులు, మరో నలుగురు పౌరులు ప్రయాణిస్తున్నారని వెల్లడించారు. అయితే, ప్రమాదంలో మృతి చెందిన వారు ఎవరు అనే వివరాలను అధికారులు ఇంకా ప్రకటించలేదు.
Mexico Plane Crash | కూలిన విమానం..
ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని మెక్సికన్ అధికారులు తెలిపారు. ఘటన సమాచారం అందుకున్న వెంటనే ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA), నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డు (NTSB) బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించాయి. ఈ ప్రమాదంపై గాల్వేస్టోన్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం కూడా స్పందించింది. రెస్క్యూ ఆపరేషన్ (Rescue Operation)లో భాగంగా డ్రోన్ యూనిట్‌తో పాటు ప్రత్యేక సహాయక బృందాలను రంగంలోకి దింపినట్లు వెల్లడించింది. ప్రస్తుతం ఘటనకు సంబంధించిన అన్ని కోణాల్లో దర్యాప్తు జరుగుతోందని తెలిపింది.
ఇదిలా ఉండగా, ప్రమాదానికి దట్టమైన పొగమంచు కారణమై ఉండొచ్చా అనే కోణంలో కూడా అధికారులు పరిశీలన చేపట్టారు. గత కొన్ని రోజులుగా గాల్వేస్టోన్ ప్రాంతం తీవ్రమైన పొగమంచుతో కమ్ముకుపోయిందని వాతావరణ శాఖ అధికారులు (Meteorological Department Officers)తెలిపారు. అయితే, ఇదే ప్రమాదానికి ప్రధాన కారణమా కాదా అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ విమాన ప్రమాదం మెక్సికోతో పాటు అమెరికాలోనూ తీవ్ర విషాదాన్ని నింపింది. దర్యాప్తు పూర్తయ్యాక పూర్తి వివరాలు వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.