అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Hyderabad Metro | హైదరాబాద్ నగరంలో వినాయక నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. మండపాల్లో కొలువుదీరిన గణనాథులను చూడటానికి భక్తులు తరలివస్తున్నారు. దీంతో ఆర్టీసీ బస్సులు, మెట్రోలో రద్దీ పెరిగింది.
పలు మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉండడంతో ప్రయాణికులు మెట్రోను ఆశ్రయిస్తున్నారు. దీంతో ప్రయాణికులకు మెట్రో గుడ్‌న్యూస్ చెప్పింది. శనివారం రాత్రి (ఆగస్టు 30) నుంచి మెట్రో సేవల సమయాన్ని రాత్రి 11:45 వరకు పొడిగించినట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ నిర్ణయంతో అన్ని టెర్మినల్ స్టేషన్ల నుంచి చివరి మెట్రో రైలు (Metro Train) రాత్రి 11:45 గంటలకు బయలుదేరనుంది. నిత్యం మెట్రో రైళ్లు రాత్రి 10 గంటల వరకే నడుస్తాయి. కాగా ప్రస్తుతం 1 గంట 45 నిమిషాలు అదనంగా సేవలు అందించనున్నాయి.
Hyderabad Metro | భక్తుల రద్దీకి మెట్రో సాయం
ప్రస్తుతం నగరవ్యాప్తంగా వినాయక నవరాత్రులు (Vinayaka Navaratrulu) ఘనంగా జరుగుతున్నాయి. గణపతి మండపాలను దర్శించేందుకు వేలాదిగా భక్తులు బయటకు వస్తుండటంతో, వీరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా రాత్రివేళల్లో కూడా మెట్రో ప్రయాణం సౌకర్యవంతంగా ఉండేలా ఈ చర్య తీసుకున్నట్లు మెట్రో అధికారులు(Metro Officers) తెలిపారు. “వినాయక దర్శనాల కోసం ఇప్పుడు మరింత సులభం, టెన్షన్ లేకుండా ప్రయాణించండి,” అంటూ మెట్రో యాజమాన్యం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ సేవలు కొనసాగించడం ద్వారా ప్రజలకు సమయం ఆదా చేయడం, భద్రతతో కూడిన ప్రయాణం కల్పించాలన్నదే తమ లక్ష్యమని వెల్లడించింది.
ఉత్సవాల సమయంలో నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో ట్రాఫిక్ తీవ్రంగా ఉండే అవకాశముంది. ఇటువంటి సమయంలో మెట్రో సేవలు ప్రయాణికులకు బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తుంది. భక్తులు ఈ అదనపు మెట్రో సేవలను పూర్తిగా వినియోగించుకోవాలని, రద్దీ సమయంలో వ్యక్తిగత వాహనాల వాడకాన్ని తగ్గించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.