అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Adulteration | దేశంలో కల్తీ మాఫియా రెచ్చిపోతుంది. తమ లాభాల కోసం ప్రజల ప్రాణాలతో కొందరు చెలగాటం ఆడుతున్నారు. ప్రతి వస్తువును కల్తీ చేసి మార్కెట్‌లో విక్రయిస్తున్నారు.
దేశంలో కల్తీ దందా రోజురోజుకు పెరిగి పోతుంది. వంటింట్లో వాడే అల్లం వెల్లుల్లి పేస్ట్ నుంచి వంట నూనెల (Oils) వరకు అన్నింటిని కల్తీ చేస్తున్నారు. నకిలీ టూత్పేస్ట్లు (Toothpaste), ఔషధాలను సైతం తయారు చేసి విక్రయిస్తున్నారు. మద్యాన్ని కూడా కేటుగాళ్లు వదలడం లేదు. తాము డబ్బులు సంపాదించడానికి ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు. అయినా సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు.
Adulteration | పలు ఘటనలు
గుజరాత్ (Gujarat)లోని కచ్‌లో నకిలీ కోల్‌గేట్ టూత్‌పేస్ట్‌ను తయారు చేసే ఫ్యాక్టరీపై పోలీసులు ఇటీవల దాడులు చేశారు. నిందితులను అరెస్ట్ చేశారు. ఢిల్లీ (Delhi)లో నకిలీ సెన్సోడైన్ టూత్‌పేస్ట్, నకిలీ ఈనో, నకిలీ గోల్డ్ ఫ్లేక్ సిగరెట్లను తయారు చేసే రాకెట్ గుట్టును పోలీసులు రట్టు చేశారు. మేడ్చల్ జిల్లా (Medchal District) కుషాయిగూడలో కల్తీ లిక్కర్ తయారు చేసి బ్రాండెడ్ స్టిక్కర్లు వేసి విక్రయిస్తున్న ముఠాను గతంలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఇలా దేశవ్యాప్తంగా చాలా వస్తువులను కల్తీ చేస్తున్నారు. బ్రాండెడ్ కంపెనీల పేరు మీద వాటిని మార్కెట్‌లో అమ్ముతున్నారు. దీంతో చాలా మంది అసలుది ఏదో.. నకిలీది ఎదో తెలుసుకోలేక పోతున్నారు. నకిలీ వస్తువులు వినియోగిస్తున్న ప్రజలు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ‘‘ఇవి కేవలం మోసాలు కాదు, మనం తెలియకుండానే తినే రోజువారీ ఉత్పత్తుల వలె మారువేషంలో ఉన్న స్లో పాయిజన్‌లు” అని నెటిజెన్లు కామెంట్ చేస్తున్నారు.
Adulteration | చర్యలు కరువు
దేశంలోని చాలా ప్రాంతాల్లో కల్తీ మాఫియా రెచ్చిపోతుంది. అయినా అధికారులు కఠిన చర్యలు చేపట్టడం లేదు. పాలను సైతం కల్తీ చేస్తున్నారు. అప్పుడప్పుడు పోలీసులు తనిఖీలు చేసి ఇలాంటి ముఠాలను అరెస్ట్ చేస్తున్నా.. దందాలు మాత్రం ఆగడం లేదు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న కల్తీ దందాపై ఉక్కుపాదం మోపాలని పలువురు కోరుతున్నారు. ఇలాంటి కేసుల్లో దొరికిన వారికి కఠిన శిక్షలు విధిస్తే.. మిగతా వారు భయపడతారని చెబుతున్నారు. అలాగే పారిశ్రామిక వాడల్లో తనిఖీలు చేపట్టడానికి ప్రత్యేక బృందాలను నియమించాలని కోరుతున్నారు.