అక్షరటుడే, వెబ్‌డెస్క్: Messi Tour | ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ (Lionel Messi) భారత పర్యటనలో తొలి రోజు హైదరాబాద్‌లో ఘనంగా ముగిసింది. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో (Rajiv Gandhi International Stadium) నిర్వహించిన ఈవెంట్లో మెస్సీ అభిమానులను ఉర్రూతలూగించాడు.
కోల్‌కతాలో చోటుచేసుకున్న గందరగోళ ఘటనల తర్వాత హైదరాబాద్ షెడ్యూల్ విజయవంతంగా సాగడం విశేషంగా నిలిచింది.ఇంటర్ మయామీ స్టార్ లియోనెల్ మెస్సీ తన సహ ఆటగాళ్లు లూయిస్ సువారెజ్, రోడ్రిగో డి పాల్‌లతో కలిసి శనివారం సాయంత్రం రాజీవ్ గాంధీ స్టేడియానికి చేరుకున్నారు. దాదాపు గంటపాటు గ్రౌండ్లో గడిపిన ఈ ముగ్గురూ అభిమానులకు మరపురాని క్షణాలను అందించారు. యువ ఆటగాళ్లతో కలిసి సరదాగా కిక్ అబౌట్ చేస్తూ స్టేడియాన్ని కేరింతలతో మార్మోగించారు.
Messi Tour | మెస్సీ మ్యాజిక్..
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో (CM Revanth Reddy) కలిసి మెస్సీ ఫుట్‌బాల్ ఆడటం ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అనంతరం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కలిసిన మెస్సీకి ఘనంగా సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా మెస్సీ అభిమానుల కోసం చేసిన ప్రత్యేక గెశ్చర్ మరింత హైలైట్ అయింది. గ్రౌండ్ నుంచి కొన్ని ఫుట్‌బాల్స్‌ను నేరుగా స్టాండ్స్‌లోకి తన్నడంతో అభిమానులు ఉత్సాహంతో హోరెత్తిపోయారు. హైదరాబాద్ కార్యక్రమం పూర్తిగా సానుకూల వాతావరణంలో ముగియగా, అదే రోజు ఉదయం కోల్‌కతాలో పరిస్థితి భిన్నంగా మారింది. యువభారతి క్రీడాంగణంలో జరిగిన ‘గోట్ టూర్’ ఈవెంట్‌కు ఆశించిన స్థాయిలో అభిమానులు హాజరుకాకపోవడంతో, ఖరీదైన టికెట్లు కొనుగోలు చేసిన వారు నిరాశకు గురయ్యారు. ఈ క్రమంలో కొందరు అభిమానులు బాటిళ్లు, కుర్చీలు విసరడం, గేట్లు పగలగొట్టేందుకు ప్రయత్నించడం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి.
పరిస్థితి అదుపు తప్పడంతో మెస్సీని వెంటనే అక్కడి నుంచి తరలించారు. ఈ గందరగోళానికి సంబంధించి ప్రధాన ఈవెంట్ ఆర్గనైజర్ సతద్రు దత్తాను పోలీసులు అరెస్ట్ చేశారు. కోల్‌కతా, హైదరాబాద్ పర్యటనల అనంతరం మెస్సీ ఆదివారం ముంబైకి, సోమవారం ఢిల్లీకి వెళ్లనున్నాడు. ముంబై పర్యటనలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన అండర్-14 యువ ఆటగాళ్లకు మెస్సీతో కలిసి ప్రాక్టీస్ చేసే అరుదైన అవకాశం కల్పించనున్నారు.
2011 తర్వాత భారత్‌కు ఇది మెస్సీ రెండో పర్యటన కావడం విశేషం. అప్పట్లో కోల్‌కతాలో అర్జెంటీనా జట్టు తరఫున వెనిజువెలాతో జరిగిన ఫ్రెండ్లీ మ్యాచ్‌లో Friendly Match ఆయన పాల్గొన్నారు. ఈసారి మాత్రం హైదరాబాద్‌లో మెస్సీ సందడి భారత ఫుట్‌బాల్ అభిమానులకు చిరస్మరణీయ అనుభూతిని అందించింది. హైదరాబాద్‌కి వచ్చి తెలుగు ప్రేక్షకులని కలవడం చాలా సంతోషాన్ని ఇచ్చిందని మెస్సీ అన్నాడు. కాగా, ఈ మ్యాచ్‌లో సింగరేణి ఆర్ఆర్ జట్టు 4-2 గోల్స్ తేడాతో అపర్ణ మెస్సీ జట్టుపై విజయం సాధించింది.