అక్షరటుడే, వెబ్‌డెస్క్: Farmer Registry | రెండు రోజులుగా వ్యవసాయ శాఖ (Agriculture Department) నుంచి రైతులకు మెసేజ్‌లు వస్తున్నాయి. ఫార్మర్ రిజిస్ట్రీలో పలాన సర్వే నంబర్లు నమోదు కాలేదు అంటూ ఫోన్లకు సందేశాలు వస్తున్నాయి. దీంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.
గతంలో రైతు గుర్తింపు కార్డులకు ఎవరైతే దరఖాస్తు చేసుకోలేదో వాళ్లకే ఈ మెసేజులు వస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రతి ఒక్కరూ రైతు గుర్తింపు కార్డుకు దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు. అయితే సందేశాలు వస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ సర్వే నంబర్ ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు కాలేదని వెంటనే మీ సేవ కేంద్రం, లేదా వ్యవసాయ అధికారులను సంప్రదించాలని మెసేజ్‌లో ఉంది. ఒకవేళ నమోదు చేసుకోకపోతే ప్రభుత్వ పథకాలు అందవని ఉండటంతో అన్నదాతలు మీ సేవ కేంద్రాలకు (Mee Seva Centers) పరుగు పెడుతున్నారు. వ్యవసాయ అధికారులకు ఫోన్లు చేసి ఆరా తీస్తున్నారు.
Farmer Registry | ఓపెన్ కానీ సర్వర్
రైతులకు సందేశాలు పంపిన ప్రభుత్వం ఫార్మర్ రిజిస్ట్రీకి సంబంధించిన సర్వర్‌ను ఓపెన్ చేయకపోవడం గమనార్హం. బుధవారం మధ్యాహ్నం వరకు సైట్ రాలేదు. మధ్యాహ్నం నుంచి సైట్ ఓపెన్ అవుతున్నా.. రైతు గుర్తింపు చేయడానికి రావడం లేదు. దీనిపై వ్యవసాయ అధికారులను సంప్రదించగా.. రెండు రోజులు పట్టే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. అయితే ఫోన్లకు సందేశాలు రావడంతో భయపడి రైతులు (Farmers) మీ సేవ కేంద్రాలకు వెళ్తున్నారు. తీరా అక్కడికి వెళ్లాక సర్వర్ రావడం లేదని వెనుదిరుగుతున్నారు.
Farmer Registry | ఇవి అవసరం
ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు చేసుకుంటేనే పీఎం కిసాన్ (PM Kisan), రైతు భరోసా వంటి ప్రభుత్వ పథకాలు అందుతాయని అధికారులు చెబుతున్నారు. దీనికోసం దగ్గరలో ఉన్న మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలి. పట్టాపాస్‌బుక్, ఆధార్ కార్డు, ఆధార్ లింక్ ఉన్న ఫోన్ నంబర్ తీసుకు వెళ్లాలి. ఓటీపీ ఆధారంగా రైతు గుర్తింపు నమోదు చేస్తారు. అయితే ప్రస్తుతం సైట్ ఓపెన్ అవుతున్నా.. నమోదు చేయడానికి రావడం లేదని మీ సేవ నిర్వాహకులు చెబుతున్నారు.
Farmer Registry | రైతు భరోసా సమయంలో..
ప్రస్తుతం యాసంగి సీజన్ సాగు పనులు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటి వరకు రైతు భరోసా (Rythu Bharosa) విడుదలపై ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు. శాటిలైట్ సర్వే అనంతరం రైతు భరోసా విడుదల చేస్తామని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. అయితే ఈ సమయంలో రైతులకు మెసేజ్‌లు వస్తుండటంతో.. తమకు రైతు భరోసా రాదేమోనని ఆందోళన చెందుతున్నారు. చాలా మంది రైతులు ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు చేసుకోలేదు. దీని ఆధారంగా రైతు భరోసా విడుదల చేస్తే అనేక మంది నష్టపోయే అవకాశం ఉంది. ఏళ్లుగా రైతుబంధు, రైతు భరోసా ఖాతాల్లో జమ అవుతుండగా.. ప్రస్తుతం కొత్త విధానం ఎందుకని రైతులు ప్రశ్నిస్తున్నారు. రైతు భరోసా ఎగ్గొట్టేందుకు ప్రభుత్వం కుట్ర చేసిందని ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు.