అక్షరటుడే, వెబ్‌డెస్క్: IND vs AUS | భారత్, ఆస్ట్రేలియా (IND vs AUS) మధ్య జరుగుతున్న టీ20 సిరీస్‌లోని రెండో మ్యాచ్ శుక్రవారం మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో జరగనున్న విషయం తెలిసిందే. మధ్యాహ్నం 1.45ని.లకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
అయితే అక్కడి వాతావరణం మరోసారి అభిమానులను ఆందోళనకు గురి చేసేలా కనిపిస్తోంది. కాన్‌బెర్రాలో జరిగిన మొదటి మ్యాచ్ వర్షం కారణంగా మధ్యలోనే నిలిచిపోగా, ఇప్పుడు మెల్‌బోర్న్‌లో కూడా అదే పరిస్థితి తలెత్తే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ (Meteorological Department) హెచ్చరించింది. అక్టోబర్ 31న మెల్‌బోర్న్‌లో వర్షం పడే అవకాశం 87 శాతంగా అంచనా వేయబడింది.
IND vs AUS | వరుణుడిపైనే ఆశలు..
మధ్యాహ్నం సమయంలో వర్షం పడే అవకాశం 70 శాతం కంటే ఎక్కువ గా ఉందని ఆక్యూ వెదర్ తెలిపింది. మ్యాచ్ స్థానిక సమయం ప్రకారం మధ్యాహ్నం 1:45 గంటలకు ప్రారంభం కానుంది. ఆ సమయానికే వర్షం పడే అవకాశం ఉండడంతో మ్యాచ్ జరగడం కష్టమనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొదటి టీ20లో భారత్ అద్భుతమైన ఆరంభం ఇచ్చింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, శుభమన్ గిల్ వేగవంతమైన ఇన్నింగ్స్‌తో స్కోర్‌బోర్డును పరుగులు పెట్టించారు. కానీ 9.4 ఓవర్లు పూర్తయ్యేలోపు వర్షం కారణంగా ఆట ఆగిపోయింది. ఈసారి పూర్తి మ్యాచ్ చూడాలని అభిమానులు ఆశపడుతున్నప్పటికీ, వాతావరణ సూచనలు మాత్రం అంత అనుకూలంగా లేవు.
మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (Melbourne Cricket Ground) సాధారణంగా బౌలర్లకు అనుకూలంగా ఉంటుంది. పెద్ద మైదానం కావడం వల్ల బ్యాట్స్‌మెన్‌లు ఇక్కడ పెద్ద షాట్లు కొట్టడం కష్టమే. అయితే ఇటీవల బిగ్ బాష్ లీగ్‌లో ఈ పిచ్‌పై పెద్ద స్కోర్లు నమోదైన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ నాథన్ ఎల్లిస్ మాట్లాడుతూ, “ప్రస్తుతం MCG పిచ్ బ్యాటింగ్‌కి అనుకూలంగా ఉంది, మంచి టోటల్ చూడొచ్చు” అని తెలిపారు. అయితే ఆకాశం మేఘావృతమై ఉంటే, బౌలర్లకు స్వింగ్ దొరకే అవకాశం ఉంది. అందుకే ఇరుజట్లు వాతావరణం, పిచ్ పరిస్థితులను బట్టి వ్యూహాలు సిద్ధం చేస్తున్నాయి.
IND vs AUS | ఎప్పుడు, ఎక్కడ చూడాలి
మ్యాచ్ తేదీ : అక్టోబర్ 31 (శుక్రవారం)
 వేదిక : మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (MCG)
 మ్యాచ్ ప్రారంభం : మధ్యాహ్నం 1:45 గంటలకు
 లైవ్ టెలికాస్ట్ : స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్
 ఆన్‌లైన్ స్ట్రీమింగ్ : JioCinema ,Disney+ Hotstar యాప్‌లలో ప్రత్యక్ష ప్రసారం అందుబాటులో ఉంటుంది.

