అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Mega Family Summer Movies | టాలీవుడ్లో ఒకే కుటుంబం నుంచి వరుసగా సినిమాలు రావడం కొత్తేమీ కాదు. కానీ ఒకే సీజన్లో ఐదుగురు స్టార్లు, యంగ్ హీరోలు, నిర్మాతలు కలిసి బాక్సాఫీస్‌పై దండయాత్ర చేయడం మాత్రం అరుదైన విషయం. 2026 సంక్రాంతి సీజన్లో మెగాస్టార్ సినిమా భారీ విజయం సాధించిన వేడి ఇంకా తగ్గకముందే, ఇప్పుడు సమ్మర్ సీజన్‌ను కూడా మెగా ఫ్యామిలీ తమ ఖాతాలో వేసుకోవడానికి సిద్ధమైంది.
మార్చి నుంచి జులై వరకు ప్రతి నెలా ఒక మెగా ప్రాజెక్ట్ థియేటర్లలో సందడి చేయనుంది. సంక్రాంతి బరిలో మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘మన శంకర వరప్రసాద్ గారు’ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు నమోదు చేసింది. సుమారు ₹375 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఈ విజయంతో మెగా అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపైంది. అదే జోష్‌ను కొనసాగిస్తూ వేసవిలోనూ వరుస రిలీజ్‌లకు ప్లాన్ చేశారు.
Mega Family Summer Movies | పవర్ స్టార్‌తో సమ్మర్ స్టార్ట్
సమ్మర్ సీజన్‌కు శ్రీకారం చుట్టేది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan). హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మార్చి 26న విడుదల కానుంది. పోలీస్ ఆఫీసర్ పాత్రలో పవన్ కళ్యాణ్ కనిపించనున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. యాక్షన్, మాస్ ఎలిమెంట్స్‌తో ఈ సినిమా సమ్మర్ బాక్సాఫీస్‌కు బలమైన ఆరంభం ఇవ్వనుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ తర్వాత నిహారిక కొణిదెల నిర్మాతగా రూపొందిస్తున్న ‘రాకాస’ చిత్రం ఏప్రిల్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. సంగీత్ శోభన్ హీరోగా నటిస్తున్న ఈ యూత్‌ఫుల్ ఎంటర్టైనర్పై యువతలో మంచి ఆసక్తి కనిపిస్తోంది. ఇక ఏప్రిల్ నెలాఖరులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) వంతు రానుంది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’ ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమా రామ్ చరణ్ కెరీర్లో మరో మైలురాయిగా నిలుస్తుందని అంచనాలు ఉన్నాయి.
వేసవి ముగిసేలోపు మెగాస్టార్ చిరంజీవి మరోసారి ‘విశ్వంభర’తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సోషియో-ఫాంటసీ చిత్రం భారీ గ్రాఫిక్స్, అంతర్జాతీయ స్థాయి విజువల్స్‌తో జులైలో విడుదల కానుందని సమాచారం. అదే సమయంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) నటిస్తున్న ‘కొరియన్ కనకరాజు’ కూడా సమ్మర్లోనే థియేటర్లలోకి రానుంది. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ హారర్-కామెడీ ఎంటర్టైనర్లో రితికా నాయక్ హీరోయిన్గా నటిస్తోంది. మొత్తానికి సమ్మర్ 2026ను “మెగా సీజన్”గా మార్చేందుకు ఈ వరుస రిలీజ్లు కీలకంగా మారనున్నాయి.