అక్షరటుడే, వెబ్‌డెస్క్: Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka) గురువారం ప్రజా భవన్లో రాష్ట్రంలోని ఎంపీలతో సమావేశం నిర్వహించారు. డిసెంబర్ 1 నుంచి 19 వరకు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరగనున్నాయి. ఈ క్రమంలో అన్ని పార్టీల ఎంపీలతో ఆయన చర్చించారు.
రాష్ట్ర ప్రయోజనాల కోసమే రాజకీయాలకు అతీతంగా ఎంపీల సమావేశం నిర్వహించినట్లు భట్టి విక్రమార్క తెలిపారు. బీసీలకు సంబంధించిన 42 శాతం రిజర్వేషన్ బిల్లు (reservation bill) ఆమోదం కోసం 9వ షెడ్యూల్లో సవరణ జరగాలన్నారు. ఈ అంశంపై పార్లమెంట్ సమావేశాల్లో (Parliament sessions) ప్రత్యేక చర్చకు తీసుకురావాలని ఎంపీలకు సూచించారు. ప్రధానిని కలిసి అన్ని పార్టీల ఎంపీలు ఓ వినతిపత్రం ఇవ్వాలన్నారు. ప్రధాని సమయం ఇస్తే సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధ్యక్షతన ఢిల్లీకి వచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.
రాష్ట్రంలోని పలు సమస్యలపై పార్లమెంట్లో లేవనెత్తాలని ఆయన సూచించారు. ఈ మేరకు అధికారులు 12 విభాగాల్లో 47 ప్రాధాన్యతా అంశాలను పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఎంపీలకు వివరించారు. రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ ప్రాజెక్టులు, నిధుల మంజూరుపై కేంద్రాన్ని ఒత్తిడి చేయాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. వివిధ మంత్రిత్వ శాఖల వద్ద ఉన్న ఫైళ్ల పురోగతి కి సంబంధించిన సమాచారాన్ని పార్టీ ఎంపీలకు డిప్యూటీ సీఎం భట్టి అందజేశారు.
ఈ సమావేశంలో ఎంపీలు మల్లు రవి, బలరాం నాయక్, సురేష్ కుమార్ షెట్కార్, చామల కిరణ్ కుమార్ రెడ్డి, రామసహాయం రఘురాంరెడ్డి, సురేందర్ రెడ్డి, కడియం కావ్య, గడ్డం వంశీ, అనిల్ కుమార్ యాదవ్, రఘునందన్ రావు, గోడం నగేష్ తదితరులు పాల్గొన్నారు.